JANASENA: తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. ఏ పార్టీపై ప్రభావం పడబోతోంది..?
అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కావాల్సిన కేడర్ జనసేనకు లేదు. దీంతో పార్టీకి బలమున్న ప్రాంతాల నుంచే బరిలోకి దిగేందుకు రెడీ అయింది. పార్టీ కేడర్‌తో పాటు బలమైన నాయకులను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.
JANASENA: తెలంగాణలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. ఇప్పటికే.. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించగా.. చిన్నా చితక పార్టీలు కూడా ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయ్. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన జనసేన.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఎంటర్ అవుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కావాల్సిన కేడర్ జనసేనకు లేదు. దీంతో పార్టీకి బలమున్న ప్రాంతాల నుంచే బరిలోకి దిగేందుకు రెడీ అయింది.
పార్టీ కేడర్‌తో పాటు బలమైన నాయకులను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. పోటీ చేయబోయే 32 నియోజకవర్గాల జాబితాను కూడా విడుదల చేసింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మునుగోడు, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీకి పడుతున్నాయ్. ఇప్పుడు జనసేన కూడా బరిలోకి దిగుతుండటంతో.. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన.. తెలంగాణలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన ప్రకటించగా.. తెలంగాణలో ఎలా ముందుకు సాగుతుందన్నది చర్చనీయాశంగా మారింది. తెలంగాణలో గతంలో కంటే గట్టిగానే పుంజుకున్న బీజేపీ.. ఇప్పుడు జనసేనతో కూడా కలిస్తే ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. షర్మిల వైటీపీ పరిస్థితి ఇంకా ఎటు తేలలేదు. మళ్లీ ఇప్పుడు బరిలోకి జనసేన రావటంతో.. బీఆర్ఎస్ కంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్న వాళ్లతో చాలా మంది పవన్ అభిమానులుగా ఉన్నారు. మరి ఆ అభిమానం ఓటుగా మారుతుందా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఓటుగా మారితే.. తెలంగాణ రాజకీయం కీలక మలుపు తీసుకునే చాన్స్ ఉంది.