Andhra Pradesh: ఏపీలో ఆ మూడు పార్టీల పొత్తు ఖాయం.. సిగ్నల్స్ ఇవే..!

కొంత రిస్క్ అయినప్పటికీ.. కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చనువు గురించి తెలిసినప్పటికీ, బీజేపీతో చెయ్యి కలపడమే సేఫ్ అని చంద్రబాబు అనుకుంటున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 08:44 PMLast Updated on: Aug 31, 2023 | 8:44 PM

Janasena Tdp And Bjp Will Contest Together In Andhra Pradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ రాబోతోందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ బీజేపీ-జనసేన టీమ్‌తో టీడీపీ కలవబోతోందనే దానిపై మాత్రం తమకు మంచి క్లారిటీ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇండియా కూటమికి లీడర్ లేడు. ఈ పాయింట్ మోడీకి అడ్వాంటేజ్ అవుతుంది’’ అని ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్.. ఆయన ఫ్యూచర్ ప్లాన్ పై అందరికీ క్లారిటీ వచ్చేలా చేసిందని చెబుతున్నారు. 2024 లోక్‌సభ పోల్స్‌లోనూ మోడీ వేవ్ వీస్తుందనే అంచనాతో టీడీపీ చీఫ్ ఉన్నారనే విషయం ఈ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని అంటున్నారు.

కొంత రిస్క్ అయినప్పటికీ.. కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చనువు గురించి తెలిసినప్పటికీ, బీజేపీతో చెయ్యి కలపడమే సేఫ్ అని చంద్రబాబు అనుకుంటున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ వేవ్ వీస్తే మాత్రం.. టీడీపీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారే ఛాన్స్ ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు టీడీపీ డిసైడ్ అయితే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్యవర్తిత్వంతో ‘ఇండియా’ కూటమి వైపు జగన్ చూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. కేవలం మోడీ వేవ్ ఆధారంగా చంద్రబాబు లెక్కలు వేసుకోవడం సరికాదని పొలిటికల్ అనలిస్టులు సూచిస్తున్నారు.
ఒకరికొకరు దగ్గరయ్యేందుకు ఇలా..
టీడీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన పురంధేశ్వరిని నియమించింది. చంద్రబాబు, లోకేశ్‌కు సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉందా.. లేదా.. అనే అంశాన్ని సమీక్షించాలని ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల స్మారక నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. చంద్రబాబును ఆ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించింది. ఇక బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా.. ప్రధాని మోడీకి అనుకూలంగా చంద్రబాబు కామెంట్స్ చేశారు. ఇండియా కూటమికి లీడర్ లేడని విమర్శించారు.
ప్రత్యేక హోదా డిమాండ్ సంగతి ఏమైనట్టు..?
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దూరమయ్యానని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మోడీ లీడర్ షిప్‌ను పొగడటానికే పరిమితం కావడం గమనార్హం. ఇప్పుడు సైకిల్ పార్టీ బాస్.. వచ్చే ఎన్నికల లక్ష్యంతోనే ఉన్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీతో కలిసి టీడీపీ జనంలోకి వెళితే.. ప్రత్యేక హోదా డిమాండ్ ను చంద్రబాబు పక్కన పెట్టారనే సంకేతాలు జనంలోకి వెళ్తాయి. దీన్ని జగన్ సేన ఎన్నికల అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అంటున్న పవన్‌ కళ్యాణ్ పార్టీకి.. ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేదని గత ఎన్నికల ఫలితాల్లోనే తేలిపోయింది. ఇక బీజేపీకి రాష్ట్రంలో క్యాడర్ పెద్దగా లేదు. ఈ పార్టీలతో కలిస్తే టీడీపీకి ప్రజాదరణ కంటే.. ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలే ఎక్కువని మరికొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.