JANASENA FORMULA : ఏపీలో జనసేన కొత్త ఫార్మాలా ! బావురుమంటున్న టీడీపీ లీడర్లు
పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి... పట్టున్నచోటే పోటీ చేయాలి. ఇప్పుడక్కడ జనసేన ఇదే ఫార్ములాకు ఫిక్సయింది. పునాదుల్లో కాంక్రీట్‌ను పకడ్బందీగా వేస్తేనే భవిష్యత్ అన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించి... ఇప్పుడు మిక్సింగ్ మొదలుపెట్టింది. ఆ పార్టీ వరకు అది బాగానే ఉన్నా.... అక్కడ టీడీపీ నేతలకు మాత్రం చెమటలు పడుతున్నాయి.
పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి… పట్టున్నచోటే పోటీ చేయాలి. ఇప్పుడక్కడ జనసేన ఇదే ఫార్ములాకు ఫిక్సయింది. పునాదుల్లో కాంక్రీట్‌ను పకడ్బందీగా వేస్తేనే భవిష్యత్ అన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించి… ఇప్పుడు మిక్సింగ్ మొదలుపెట్టింది. ఆ పార్టీ వరకు అది బాగానే ఉన్నా… అక్కడ టీడీపీ నేతలకు మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ మా సీటు గల్లంతు అవుతుందో, కనుమరుగైపోతామోనని తెగ వర్రీ అయపోతున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎప్పటికీ మర్చిపోలేని ఘోర పరాభవాన్ని మిగిల్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది జనసేన. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది గ్లాస్ పార్టీ వర్గాలకు. ఇప్పుడు ఆ ఓటమి విషాదం నుంచి బయటపడటమే కాదు.. ఈ ఐదేళ్ళలో నేర్చుకున్న కొత్త పాఠాలతో ఈసారి సమరానికి సై అంటోంది ఆ పార్టీ. పొత్తులో ఉన్నాసరే… ఈసారి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని… సత్తా చాటాలన్న పట్టుదలగా ఉన్నారట జనసేన నాయకులు. ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు నుంచి ఆరు సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అధిష్టానం కూడా అదే అభిప్రాయంతో ఉండటంతో… నియోజకవర్గాల్లో స్థానిక నేతలు కూడా దూకుడు పెంచుతున్నట్టు తెలుస్తోంది.
ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా… పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) మళ్ళీ భీమవరం నుంచే బరిలో దిగుతారని గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడి నాయకులు. ఆ సీటుతో పాటు ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, నిడదవోలు నియోజకర్గాల్లో బలమైన అభ్యర్థులు జనసేన తరపున బరిలో దిగేందుకు సై అంటున్నారట. ఆ ఊపే ఇప్పుడు టీడీపీని కూడా కంగారుపెడుతున్నట్టు తెలిసింది. సీట్ల పంపకాల సంగతి తల్చుకుంటేనే ఉమ్మడి జిల్లా టీడీపీ ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అంటున్నారు. సీనియర్ లీడర్స్ ఉన్న టిడిపి స్థానాలను పొత్తు పేరుతో జనసేనకు ఇచ్చేస్తే… తమ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో.
ముఖ్యంగా ఉంగుటూరులో తెలుగుదేశం తరపున బరిలో దిగేందుకు సిద్దమతున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు (Viranjaneyus), తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే శేషారావు, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో ఆశావాహులు తెగ టెన్షన్‌పడి పోతున్నారట. ఈసారి తమకు అవకాశం ఉంటుందో లేదోనన్న అనుమానంతో… ఇప్పటికే ఆయా నేతలు సగం నీరసించిపోయారన్నది లోకల్ టాక్. అదే సమయంలో జనసేన నేతలు మాత్రం మేం పోటీలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రచారాన్ని సైతం మొదలు పెట్టేశారు.
మరోవైపు అభ్యర్థులు, పోటీ కంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని భావిస్తున్న టిడిపి అధిష్టానం ఇప్పటికే సీనియర్స్ త్యాగాలు చేయక తప్పదనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో జనసేన ఆశిస్తున్న సీట్లలో టిడిపి సీనియర్ లీడర్ల ఆశలు గల్లంతేనని ఆ పార్టీ క్యాడర్ సైతం ఫిక్సైపోతోంది. ఊహిస్తున్నట్టుగా భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తే… జిల్లాలోని తమ అభ్యర్థులతో పాటు టీడీపీకి కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు జనసేన నాయకులు. పవన్ తన నియోజకవర్గ ప్రచారంతో పాటు జిల్లాలో తమ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు గనుక తమ విజయావకాశాలు మెరుగవుతాయన్నది గ్లాస్ పార్టీ నేతల అంచనా అన్న టాక్ జిల్లాలో ఉంది.
జనసేన వెర్షన్ అలా ఉంటే… పొత్తులో సీట్లు పొగొట్టుకోబోతున్న టిడిపి సీనియర్ లీడర్స్… ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయింది. సీటు దక్కనివాళ్ళు పార్టీలోనే కొనసాగుతారా? పక్కకు తప్పుకుంటారా? ఒకవేళ తప్పుకుంటే… వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. నిజంగానే సీటు దక్కకుంటే… సైకిల్ దిగే అవకాశం ఉన్న నాయకులు ఎవరంటూ పట్టి పట్టి పరిశీలిస్తున్నారు కొందరు. ప్రస్తుతానికి అంతా గుంభనంగానే ఉన్నా… ఆ టైం వచ్చినప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయన్నది మాత్రం ఇంట్రస్టింగ్ పాయింట్ అవుతోంది. మొత్తానికి పశ్చిమలో పాతుకు పోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి ప్లస్ అవుతున్నా… పొత్తు పార్టీ టీడీపీ సీనియర్స్‌కు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. సీట్ల పంపకాల ప్రకటన వచ్చాక పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.