Jayasudha : మణిపూర్ క్రైస్తవులపై మాట్లాడగలరా జయసుధ గారూ..??
క్రైస్తవుల అభ్యున్నతికి పాల్పడతానన్న జయసుధ మాటలు వివాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్ లో హిందువులైన మైటీలకు, క్రైస్తవులైన కుకీలకు మధ్య వార్ ఉధృతంగా సాగుతోంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. బీఆర్ఎస్ ను ఓడించి ఎలాగైనా పాగా వేయాలనుకుంటోంది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే దాదాపు పాతిక మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయి నేతలను సైతం ఈసారి అసెంబ్లీ బరిలో నిలపాలనుకుంటోంది హైకమాండ్. అదే సమయంలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు కూడా గాలం వేస్తోంది. అందులో భాగంగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ జయసుధను కూడా పార్టీలో చేర్చుకుంది. ఆమెను సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.
జయసుధ నిన్న ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. బీజేపీలో చేరికపై ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని జయసుధ వివరించారు. రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉన్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే దేనికైనా సమయం, సందర్భం రావాలని ఆమె అన్నారు. తాను టైమ్ ని నమ్ముతానన్నారు. ఇక బీజేపీ బలోపేతానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారామె. ముఖ్యంగా క్రైస్తవుల అభ్యున్నతికి పాటు పడతానని జయసుధ మాటిచ్చారు. క్రైస్తవ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకునే బీజేపీ జయసుధను పార్టీలో చేర్చుకుందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ లో క్రైస్తవుల ఓట్లను సొమ్ము చేసుకునేందుకు జయసుధను బరిలోకి దింపి సక్సెస్ అయింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది.
అయితే క్రైస్తవుల అభ్యున్నతికి పాల్పడతానన్న జయసుధ మాటలు వివాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్ లో హిందువులైన మైటీలకు, క్రైస్తవులైన కుకీలకు మధ్య వార్ ఉధృతంగా సాగుతోంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పాలన అంతా మైటీలో చేతుల్లోనే ఉంది. అక్కడ క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారు. కుకీలపై మైటీలు దారుణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నా కుకీలను కాపాడడంలో విఫలమవుతోంది. జయసుధ ఇక్కడ క్రైస్తవులను ఉద్దరించే బదులు ముందు మణిపూర్ లో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీని ప్రశ్నించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రేపు ఆమె జనంలోకి వచ్చినా ఇదే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే ఆవకాశం కనిపిస్తోంది. మరి దీన్ని జయసుధ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.