Jayasudha: బీజేపీలోకి జయసుధ ? వాళ్ల ఓటు బ్యాంక్‌పై కాషాయం కన్నేసిందా ?
కిషన్ రెడ్డి, జయసుధ భేటీ మళ్లీ కొత్త చర్చను తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న జయసుధ ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ కూడా జయసుధను ప్రోత్సహిస్తుందా లేదా అన్నది చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ మొదలుకాగానే సినీ గ్లామర్ కూడా దానికి తోడవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలుకావడంతో సినీ రాజకీయం మొదలయ్యింది. కొంతమంది స్టార్స్ ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్స్ గా ఇప్పటికే మారిపోగా.. మరికొంతమంది మాత్రం సీజనల్ గా తెరపైకి వస్తుంటారు. ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఆమె కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆమె కలవడంతో ఈ ప్రచారం జోరందుకుంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవమున్న జయసుధ.. ఈసారి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్ని కండువాలు మార్చినా..?
సహజ నటిగా వివిధ పాత్రల్లో ఆమె తెలుగు ప్రజల మనసు దోచుకున్నా… రాజకీయ నాయకురాలిగా మాత్రం జయసుధ సక్సెస్ సాధించలేకపోయారనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ 2009 నుంచి 2014 వరకు సికింద్రాబాద్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. జయసుధ క్రీస్తును నమ్ముకోవడం.. సికింద్రాబాద్‌లో క్రిస్టియన్లు ఓట్లు ఎక్కువగా ఉండటం.. నాడు కాంగ్రెస్‌కు కూడా వాతావరణం సానుకూలంగా ఉండటంతో జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. మేకప్ వేసుకుని డైరెక్టర్ చెప్పినట్టు నటించే వాళ్లు.. వేరే రంగంలోకి అడుగుపెట్టినప్పుడు.. వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. ఎవరో ఏదో చెబుతారని.. తమను గైడెన్స్ చేస్తారని ఎదురుచూడకూడదు. కానీ జయసుధ.. రాజకీయ నేతగా మారినా.. రాజకీయాలను మాత్రం పూర్తిగా వంటపట్టించుకోలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆమె పొలిటికల్ లైఫ్ తలకిందులైపోయింది. మరోసారి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి పోటీకి దింపినా…ఈ సారి ఆమె ప్రార్థనలు ఫలించలేదు. ఘోరంగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పెద్దగా ప్రజల మధ్య పెద్దగా కనిపించిన సందర్భాలు కూడా లేవు. గెలిచినా ఓడినా.. రాజకీయాల్లోనూ, ప్రజల మధ్యన ఉంటే.. ఏదో రోజు ఉన్నత స్థానాలకు వెళ్తారు. కానీ జయసుధ.. మళ్లీ ఫిల్మ్ నగర్ వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.. ఆ పార్టీలో కూడా యాక్టివ్ రోల్ పోషించకుండా.. గెస్ట్ ఆర్టిస్ట్ గా వ్యవహరించారు. దీంతో జగన్ సహా.. వైసీపీ నేతలంతా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఇంకెన్నాళ్లకు జయసుధకు చంద్రబాబుపై అభిమానం పొంగుకొచ్చి… టీడీపీ గూటికి చేరుకున్నారు. ఇలా అనేక కండువాలు మార్చిన జయసుధ ఎక్కడా స్థిరంగా లేరు.
పాలిటిక్స్ అంటే పార్ట్ టైమ్ కాదుకదా ?
సినీ గ్లామర్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలో పదవులు సంపాదించాలనుకున్న వాళ్లకు కాలం అన్ని వేళలా కలిసిరాదు అనడానికి జయసుధే బెస్ట్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్ ను జయసుధ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు. తన అవసరార్థం రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారే తప్ప.. గ్రౌండ్ లెవల్‌లో ప్రజాసేవ చేయాలన్న ఆలోచన లేనట్టు ఆమె పొలిటికల్ కెరీర్‌ను చూస్తే అర్థమైపోతుంది. సినిమాల్లో సంపాదించుకుంటూ టైమ్ దొరికినప్పుడు రాజకీయాలు చేయడమే ఇందుకు కారణం. జయసుధ ఎప్పుడు ఏ పార్టీ నేతను కలుస్తారు.. అసలు ఆమె ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.. దీనిని బట్టి ఆమె ఎంత సీరియస్ పొలిటీషియనో అర్థం చేసుకోవచ్చు.
మళ్లీ సికింద్రాబాద్ టిక్కెట్ ఆశిస్తున్నారా ?
కిషన్ రెడ్డి, జయసుధ భేటీ మళ్లీ కొత్త చర్చను తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న జయసుధ ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ కూడా జయసుధను ప్రోత్సహిస్తుందా లేదా అన్నది చూడాలి. అసలు జయసుధ బీజేపీ కండువా కప్పుకున్నా..ఆమె వల్ల ఆ పార్టీకి ఎంత ప్రయోజనం ఉంటుందన్నది కూడా చెప్పలేం. చూడాలి.. జయసుధ మెడలో ఈసారి ఏ పార్టీ కండువా ఉంటుందో…