Ponguleti – Jupalli : కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి.. ఇద్దరు నేతల నిర్ణయం సరైందేనా ?
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సస్పెన్షన్ తర్వాత.. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
Ponguleti Srinivasa Reddy: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు కౌంట్‌డౌన్ మొదలైన వేళ.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాన్ని మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
దీంతో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సస్పెన్షన్ తర్వాత.. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంతకు ఇంతా తీర్చుకుంటాం.. కారు పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తాం అన్నట్లుగా సవాల్ విసిరారు. ఆర్ధికంగా, రాజకీయంగా, జనబలంపరంగా ఇద్దరు నేతలు చాలా స్ట్రాంగ్. దీంతో పొంగులేటి, జూపల్లి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే చర్చ జరిగింది. ఇద్దరిని అక్కున చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఈ ఇద్దరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపించింది. వారి భవిష్యత్ అడుగులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధం అవుతున్నారు. సరూర్ నగర్‌లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక సమక్షంలో.. ఈ ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరితో ఇద్దరు నేతలు చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ఎన్నికల వేళ.. ఈ ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ దూకుడు రాజకీయం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీమ్ వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్‌లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కేసీఆర్ మీద కసితో కనిపిస్తున్న జూపల్లి.. కాంగ్రెస్‌లో చేరితేనే అది సాధ్యం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అయినట్లు కనిపిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌తో కంపేర్ చేస్తే కమలానికి అంత బలం లేదు.
నిజానికి చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. బీజేపీలో చేరితే గెలుపు బాధ్యత అంతా తామే తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాంగ్రెస్‌లో చేరితే తమ బలానికి మరింత బలం యాడ్ అవుతుందని ఇద్దరు నేతలు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే హస్తం గూటికి చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ పార్టీలో చేరితే కాంగ్రెస్‌కు బలమే. అయితే, ఇప్పటికే ఆ పార్టీలో రోజుకో పంచాయితీ తెరమీదకు వస్తోంది. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న పంచాయితీ బీజేపీకి బలంగా మారుతోంది. ఇదంతా వదిలేస్తే.. 2018 వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో కొందరు అభ్యర్థులకు ఫండింగ్ చేసి.. గెలిచిన తర్వాత లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో ఓపెన్‌గానే వినిపిస్తోంది. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే మరి వారి ప్రయాణం సాఫీగా సాగుతుందా? వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అంటే.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటున్నారు విశ్లేషకులు.