Jupally Krishna Rao: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి, కూచుకుళ్ల.. బహిరంగ సభ లేనట్టేనా..?
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, శ్రీ వర్ధన్ సహా ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
Jupally Krishna Rao: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కంటోన్మెంట్ నేత శ్రీ వర్ధన్ సహా ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
ఈ కార్యక్రమానికి ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీలలో ఒకరు హాజరయ్యే అవకాశాలున్నాయి. నిజానికి వీళ్లంతా జూపల్లి సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో గత నెలలోనే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. పెద్ద ఎత్తున నిర్వహించాలనుకున్న ఈ సభకు ప్రియాంకా గాంధీ హాజరవ్వాలి. కానీ, వర్షాల వల్ల ఈ సభ రెండుసార్లు రద్దైంది. ఈ నేపథ్యంలో ఇక సభ పూర్తిగా రద్దైనట్లేనని కొందరు భావిస్తుండగా.. అలాంటిదేమీ లేదని జూపల్లి అనుచరులు చెబుతున్నార. మరికొద్ది రోజుల్లో.. మరో రోజు సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ నెల రెండో వారంలోపు బహిరంగ సభ జరిగే అవకాశాలున్నాయి. అయితే, అప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిక కుదరకపోతే.. జూపల్లి, ఇతర నేతల రాజకీయ కార్యక్రమాలు వాయిదాపడే అవకాశాలున్నాయి. పార్టీలో చేరిక ఆలస్యమైతే ప్రజల్లోకి వెళ్లడం కూడా ఆలస్యమవుతుంది.
ఎంత త్వరగా పార్టీలో చేరితే.. అంత త్వరగా కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు చేపట్టి, జనానికి దగ్గరవ్వొచ్చు. ఈ ఆలోచనతోనే బహిరంగ సభ లేకపోయినాసరే.. ఢిల్లీలో నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలోనే ఉన్నారు. ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. రేవంత్, మల్లు రవి సమక్షంలో.. ఖర్గే ఆధ్వర్యంలో జూపల్లి, అనుచరులు కాంగ్రెస్‌లో చేరుతారు. అధికారికంగా కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్వరలోనే ప్రియాంకా గాంధీ వీలునుబట్టి.. కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ తేదీని నిర్ణయిస్తారు.