Kadapa YCP Politics: రాజంపేట వైసీపీలో కుమ్ములాటలు.. టిక్కెట్ల కోసం ఫైట్ !

ఎమ్మెల్యేని బుజ్జగించేందుకు ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చినా.. అయితే నాకేంటి అన్నట్టుగా ఉన్నారట ఎమ్మెల్యే. ఇటు అమర్నాథ్‌రెడ్డి వర్గం కూడా దీటుగానే కౌంటర్‌ ఇస్తున్నట్టు తెలిసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 08:03 PMLast Updated on: Feb 21, 2024 | 8:03 PM

Kadapa Ycp Politics Rajampet Mla Vs Zp Chairman

Kadapa YCP Politics: అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వర్సెస్‌ ఉమ్మడి కడప జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి అన్నట్టుగా మారుతోంది వ్యవహారం. సిట్టింగ్‌ మేడాను కాదని పార్టీ అధిష్టానం ఆకేపాటికి ఇన్ఛార్జ్‌ బాధ్యతలు ఇవ్వడంతో లోలోపల రగిలిపోతోందట మేడా వర్గం. అందుకే టైం చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారని, ఆకేపాటిని ఇరుకున పెట్టేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్‌రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించడంతో.. ఈసారి కూడా తమకే టిక్కెట్‌ అని ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న మల్లికార్జున్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోందట.

PAWAN KALYAN: జగన్.. అభివృద్ధి బటన్ నొక్కు.. ఆ మాటతో జాతీయ నేతలతో తిట్లు తిన్నా: పవన్ కళ్యాణ్

ఎమ్మెల్యేని బుజ్జగించేందుకు ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చినా.. అయితే నాకేంటి అన్నట్టుగా ఉన్నారట ఎమ్మెల్యే. ఇటు అమర్నాథ్‌రెడ్డి వర్గం కూడా దీటుగానే కౌంటర్‌ ఇస్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు కలిసి పనిచేసి తాము మేడా మల్లి ఖార్జున రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని, ఇప్పుడు తన కోసం పనిచేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. రఘునాథ రెడ్డికి రాజ్యసభ టిక్కెట్‌పై సంతోషంగా ఉన్నా మల్లిఖార్జున రెడ్డికి మరోసారి ఛాన్స్‌ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట ఆయన అనుచరులు. టైం కోసం ఎదురు చూస్తూ.. ఛాన్స్‌ దొరికితే ఆకేపాటిని ఇబ్బందిపెట్టేందుకు కాచుక్కూర్చున్నట్టు చెబుతున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. అందులో భాగంగానే తాజాగా అసైన్‌మెంట్‌ భూముల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన గళం విప్పారు ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి అనుచరులు.

TDP SENIORS: సీటు గోవిందా.. టీడీపీలో సీట్ల సిగపట్లు.. సీనియర్లకీ టిక్కెట్లు డౌటే

నియోజకవర్గంలోని సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె మండలాలకు చెందిన మేడా అనుచరులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై నిరసన తెలిపారు. అలాగే రెండో విడత అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం జరపకపోవడంపై 40 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలతో పాటు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు నిరసన స్వరం వినిపిస్తున్నారు. సాక్షాత్తు సీఎం ఆదేశిస్తే కూడా తమకు భూములు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో అధికారుల మాటలు నమ్మి కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకున్నామనీ.. ఇప్పుడు వాళ్ళు కాకుంటే.. ఇంకెవరు తమకు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు లబ్దిదారులు. అయితే అసైన్డ్‌ భూముల వ్యవహారాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ గిరిషా పెండింగ్‌లో పెట్టారనీ, అందులో తమ జోక్యం ఏమీ లేదని వివరణ ఇస్తోంది ఆకేపాటి వర్గం.

ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఇది అసైన్డ్‌ భూముల వ్యవహారంలాగే కనిపిస్తున్నా.. ఎన్నికల టైంకి ఇది మరోలా టర్న్ కావచ్చని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తన అనుచరులతోపాటు అమర్నాథ్‌రెడ్డి బాధితుల్ని కూడా కలుపుకొని ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో అదును చూసి దెబ్బకొడుతున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆకేపాటి. ఈ పరిణామాలన్నీ ఎన్నికల్లో ప్రతికూలంగా మారక ముందే అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతోంది కేడర్‌. లేదంటే డ్యామేజ్‌ తప్పదన్న వార్నింగ్స్‌ కూడా వినిపిస్తున్నాయి. రాజంపేటను పార్టీ పెద్దలు ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.