Kalvakuntla Ramya Rao: కాంగ్రెస్ నుంచి కరీంనగర్ బరిలో కల్వకుంట్ల రమ్యారావు..?

కరీంనగర్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావును బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ టికెట్ కోసం ఎన్నడూ పెద్దగా ట్రై చేయని రమ్యారావు ఈసారి మాత్రం ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 10, 2023 | 05:29 PMLast Updated on: Aug 10, 2023 | 5:29 PM

Kalvakuntla Ramya Rao Will Contest From Karimnagar As Congress Candidate

Kalvakuntla Ramya Rao: దక్షిణ తెలంగాణలో నల్లగొండ జిల్లాకు రాజకీయంగా ఎంత ప్రాముఖ్యం ఉందో.. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు అంతే ప్రాముఖ్యం ఉంది. అటువంటి కరీంనగర్‌లో మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు కాంగ్రెస్ స్కెచ్ గీస్తోంది. ఈక్రమంలోనే కరీంనగర్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావును బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ టికెట్ కోసం ఎన్నడూ పెద్దగా ట్రై చేయని రమ్యారావు ఈసారి మాత్రం ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

ఆగస్టు 15 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయి.. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలోని పెద్దలతో భేటీ కావాలని ఆమె భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తే తనకు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను కల్వకుంట్ల రమ్యారావు ఇప్పటికే కోరారు. పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్ అసెంబ్లీ సీటుకు వస్తే.. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని ఆమె చెబుతున్నారు. ఏదో ఒక రకంగా ఈసారి కరీంనగర్ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కరీంనగర్‌లో సీనియర్ కాంగ్రెస్ నేతగా తనకు ఉన్న పరిచయాలతో, ప్రజల అభిమానంతో తప్పకుండా గెలుస్తానని రమ్యారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోటీలో ఎంఎస్ఆర్ మనువడు..
ఇక కరీంనగర్‌ గ్రౌండ్ లెవల్ రాజకీయాలను పరిశీలిస్తే.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ మనువడు, ఎన్ఆర్ఐ రోహిత్ రావు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రోహిత్ రావు విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొన్నం తరువాత అంత చరిష్మా కలిగిన లీడర్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించడం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితానికి ఎంఎస్ఆర్ అండగా ఉంటే ఇప్పుడు ఆయన మనువడు రోహిత్‌కు పొన్నం ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను అసెంబ్లీ బరిలోకి దిగకపోతే.. రోహిత్ అభ్యర్థిత్వానికే పొన్నం మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కల్వకుంట్ల రమ్యారావు ప్రతిపాదనకు పొన్నం ప్రభాకర్ నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.
వేములవాడ లేదా హుస్నాబాద్‌కు బండి సంజయ్‌..?
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ వరుసగా మూడోసారి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత బండి సంజయ్‌ మీద 14974 ఓట్ల ఆధిక్యంతో ఆయన నెగ్గారు. కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసిన పొన్నం ప్రభాకర్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బండి సంజయ్‌ 2019లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పక్షాన పోటీచేసి సంచలన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ పోటీచేయడం ఖాయం. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక బీజేపీ నుంచి బండి సంజయ్ మరోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి సంజయ్ కరీంనగర్ నుంచి కాకుండా వేములవాడ లేదా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా కమలదళంలో సాగుతోంది. ఒకవేళ కరీంనగర్ అసెంబ్లీ నుంచి బండి సంజయ్ పోటీ చేయకపోతే.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎంఎస్ఓ కొత్త జయపాల్ రెడ్డి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు.