Vijay Sethupathi: పాన్ ఇండియా స్థాయిలో సీఎం బయోపిక్.. హీరోగా విజయ్ సేతుపతి
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ రూపొందనుంది. లీడర్ రామయ్య పేరుతో రూపొందునున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి.. సిద్ధరామయ్య పాత్రలో కనిపించబోతున్నారు.

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరో విలక్షణ పాత్రలో నటించేందుకు రెడీ అయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ రూపొందనుంది. లీడర్ రామయ్య పేరుతో రూపొందునున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి.. సిద్ధరామయ్య పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా రూపొందనున్న సిద్ధరామయ్య బయోపిక్‌కు సత్యరత్నం దర్శకత్వం వహిస్తారు.
తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు ఇతర భాషల్లోనూ.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో సిద్ధరామయ్య బాల్యం, స్టూడెంట్ లైఫ్, కాలేజ్ డేస్, లాయర్‌గా పని చేసిన లైఫ్, రాజకీయ ప్రవేశం, రెండుసార్లు సీఎం కావడం వంటి అంశాల్ని ఆసక్తికరంగా చూపించనున్నారు. బయోపిక్‌కు సంబంధించి మొదటి పార్ట్‌లో విజయ్ సేతుపతి అతిథి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఆ తర్వాత రెండో పార్టులో పూర్తిస్తాయి పాత్రలో విజయ్ నటిస్తారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సామాన్యుడిగా మొదలైన సిద్ధరామయ్య ప్రస్థానం.. సీఎం సీటు వరకు ఎలా చేరింది అనేదే ఈ చిత్ర కథ. ఇటీవల కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అధికార బీజేపీని ఓడించి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించారు. ఇక్కడ కాంగ్రెస్ విజయంతోనే దేశవ్యాప్తంగా ఆ పార్టీ తిరిగి పుంజుకునే పనిలో ఉంది. కాంగ్రెస్ తరఫున సిద్ధరామయ్య సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన సీఎం పదవి చేపట్టడం ఇది రెండోసారి. కాగా, ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధరామయ్య చెప్పారు. సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తయ్యాక.. ఆయనను కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆగష్టు 3, గురువారం సిద్ధరామయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.