Karnataka Bahubali: కర్ణాటక గడ్డపై బాహుబలి సీన్! సీఎం.. సీఎం అంటూ అరుపులు
బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ 'బాహుబలి బాహుబలి' అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్ అయ్యింది.
Karnataka Bahubali: సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్‌పై సిద్ధరామయ్యే పైచేయి సాధించినా.. ప్రమాణస్వీకారం స్టేజీపై మాత్రం సీన్ వేరేలా పండింది. డీకే శివకుమార్ నినాదాలతో సభాస్థలి మారుమోగింది. సిద్ధరామయ్యా మాస్‌లీడర్ అని.. డీకే శివకుమార్ క్లాస్ లీడర్ అని కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య ప్లస్సులు, మైనస్‌లు అంటూ కొంతమంది ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్‌కు 135మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉంటే అందులో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యేకే ఉందని.. అందుకే ఆయన్నే సీఎం చేశామని హైకమాండ్ కూడా ప్రకటించింది. ఇవన్నీ నిజాలే కావొచ్చు. డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేకపోయి ఉండొచ్చు. నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. వాళ్లు కూడా సిద్ధరామయ్యేకే పట్టం కట్టాలని కోరుకుంటున్నట్లు పలు మీడియా సంస్థలు కోడై కూశాయి. చివరికి సిద్ధరామయ్యే కర్ణాటక సీఎంగా ప్రమాణాస్వీకారం చేశారు. అయితే సభాస్థలిపై జరిగిన కొన్ని సన్నివేశాలు డీకే శివకుమార్‌పై ప్రజలకున్న ఆదరణను చూపిస్తున్నాయి.
బాహుబలి సీన్ రిపీట్
బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ ‘బాహుబలి బాహుబలి’ అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్ అయ్యింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో స్టేడియం ఒక్కసారిగా ఆయన నామస్మరణతో మారుమోగింది. ‘సీఎం సీఎం’ అంటూ అక్కడి ప్రజలు ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపించారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. డీకే శివకుమార్ ప్రభాస్ అని.. సిద్ధరామయ్య రాణా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టేజీపై సోనియాగాంధీ లేరు.. ఒకవేళ ఉండి ఉంటే ఆమె రమ్యకృష్ణ అయ్యి ఉండేవారు. అటు నాజర్ పాత్రలో రాహుల్ గాంధీని ఊహించుకోవచ్చు.
భవిష్యత్తు సీఎం అతడే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన ఆ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. సీఎం పదవి కోసం సిద్ధరామయ్యతో తీవ్రంగా పోటీపడి చివరకు త్యాగం చేశారు. దీంతో పార్టీపై తనకున్న విధేయతను డీకే మరోసారి చాటుకున్నారు. పార్టీకి విధేయత కారణంగానే డీకే శివకుమార్ సీఎం పదవిపై పట్టు సడలించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆయన్ను ఒప్పించేందుకు స్వయంగా సోనియాగాంధీ రంగంలోకి దిగారు. చివరకు సోనియా అభ్యర్థనతో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు డీకే అంగీకరించారు. అయితే ఇదంతా కొంతకాలం వరకేనన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన ప్లాన్‌ను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికైనా.. ఎప్పటికైనా డీకే శివకుమారే కర్ణాటకకు కాబోయే సీఎం..ఇది ఫిక్సు!