DK Shivakumar: డీకే శివ కుమార్‌కు సీబీఐ కేసుల గండం.. సీబీఐ డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ నియామకంతో ఆట షురూ

శివ కుమార్‌పై నమోదైన పలు అక్రమాస్తుల కేసులు ఆయన రాజకీయ భవిష్యత్‍ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఆయనపై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి సీబీఐ విచారణ సాగబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 01:10 PMLast Updated on: May 15, 2023 | 1:13 PM

Karnataka Dgp Praveen Sood Appointed Next Cbi Director

DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించి, సీఎం రేసులో ఉన్న డీకే శివ కుమార్‌కు సీబీఐ కేసుల గండం పొంచి ఉంది. శివ కుమార్‌పై నమోదైన పలు అక్రమాస్తుల కేసులు ఆయన రాజకీయ భవిష్యత్‍ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఆయనపై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి సీబీఐ విచారణ సాగబోతుంది. అయితే, ఇప్పటివరకు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను కేంద్రం సీబీఐ డైరెక్టర్‌గా నియమించడంతో డీకే శివ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివ కుమార్ టార్గెట్‌గానే ఈ నియామకం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కర్ణాటక ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం యాధృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు.
కర్ణాటకలో 2013-2018 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో డీకే శివ కుమార్‌ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2020-23 మధ్య 13 కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 30న జరుగుతుంది. ఈ కేసుల్లో గతంలో డీకే శివ కుమార్‌ అరెస్టయ్యారు. తర్వాత బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం కర్ణాటకకు చెందిన డీజీపీనే సీబీఐ డైరెక్టర్‌గా నియామకం కావడంతో శివ కుమార్ కేసుల విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. పైగా ప్రవీణ్ సూద్‌కు కర్ణాటక వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉండటంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు డీకే శివ కుమార్‌ను కర్ణాటక సీఎంగా నియమిస్తే.. సీబీఐ కేసుల విచారణ ద్వారా ఆయన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుంది. అందుకే ఆయనను సీఎంగా నియమించే విషయంలో కాంగ్రెస్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ కేసులు డీకే శివ కుమార్‌కు ఇబ్బందిగా మారకతప్పదు. మరోవైపు ప్రవీణ్ సూద్ కూడా వ్యక్తిగతంగా డీకే శివ కుమార్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. కారణం.. అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ సూద్ పని పడతానని ఎన్నికల ప్రచారంలో డికే శివకుమార్ చెప్పుకొచ్చారు.
అవసరమైతే కేసులు పెట్టి డీజీపీని అరెస్ట్ చేయిస్తానన్నారు. దీంతో శివకుమార్‌ లక్ష్యంగా ప్రవీణ్ సూద్ పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీబీఐ డైరెక్టర్ నియామకం వెనుక బీజేపీ ప్లాన్
బీజేపీ అధిష్టానం దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగుతుంది. అలాగే వ్యూహాల అమలులో ఒక అడుగు ముందే ఉంటుంది. దీని ప్రకారమే తాజా డీజీపీ డైరెక్టర్ నియామకం జరిగినట్లు అనిపిస్తోంది. కర్ణాటక డీజీపీని నియమించినప్పుడే బీజేపీ ఏదో ప్లాన్‌తో ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి ఇబ్బంది పెడుతోందని బీజేపీపై విమర్శలున్నాయి. అలాంటిది కర్ణాటకలో బీజేపీ ఓడి.. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ నేతల్ని బీజేపీ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా కాంగ్రెస్ నేతలు, డీకే శివ కుమార్‌ టార్గెట్‌గా ఇకపై సీబీఐ అడుగులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కర్ణాటక కాంగ్రెస్ నేతల్ని ఇబ్బందిపెట్టి వారిని మరింత ఎదగనీయకుండా చూడటమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీని ఈ రేంజులో ఓడించిన పార్టీ మరోటి లేదు. అందుకే కర్ణాటకపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది.