Karnataka Effect: కర్ణాటక విక్టరీతో కాంగ్రెస్‌కు బూస్టింగ్.. వచ్చే ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?
కర్ణాటక విజయం.. కాంగ్రెస్‌కు ఎడారిలో ఒయాసిస్ కాదు.. ప్రాణం పోసిన అమృతం. కాంగ్రెస్ ఇంతే.. కాంగ్రెస్‌లో ఇంతే.. హస్తం పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో.. హిమాచల్‌ప్రదేశ్ విజయం ఊపిరిలూదితే.. కర్ణాటక విజయం వెయ్యి వోల్టుల శక్తినిచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్టీకి మళ్లీ ప్రాణం పోసింది.. పరుగుకు వేగం ఇచ్చిందీ విజయం.
కర్ణాటకలో జరిగింది పేరుకు అసెంబ్లీ ఎన్నికలే కానీ.. దేశమంతా ఇటు వైపే చూసింది. ఎవరు గెలుస్తారు.. ఏది గెలిపిస్తుంది.. ఎంత తేడాతో గెలుస్తారు.. పోలింగ్ ముగించిన నెక్ట్స్ మినిట్ నుంచి దేశవ్యాప్తంగా కనిపించిన ఉత్కంఠ ఇదే ! 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఎన్నికలు కావడంతో.. బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. బీజేపీ సంగతి వదిలేస్తే.. కాంగ్రెస్ ఊపిరిలూదిన ఎన్నికలు ఇవి.
గాంధీ కుటుంబం నాయకత్వం మీద అనుమానాలు కమ్ముకున్న వేళ.. రాహుల్ గాంధీ చుట్టూ అవమానాలు అలుముకున్న తరుణంలో.. చావో రేవో అన్నట్లుగా కర్ణాటక ఎన్నికల్లో పోటీ పడింది కాంగ్రెస్. ఇది రాహుల్ విజయమా.. గాంధీ కుటుంబం విజయమా.. కర్ణాటక నాయకత్వం విజయమా అనేది కాదు మ్యాటర్. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త చాటి ముందుకు నెట్టి గర్వంగా చెప్పుకునే విజయం ఇది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన వేళ.. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన విక్టరీ ఇది. ఈ విజయంతో.. బీజేపీ మీద నైతికంగా పైచేయి సాధించింది కాంగ్రెస్. ఈ ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికల మీదే కాకుండా.. త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రాల ఎలక్షన్‌లపై కనిపించడం ఖాయం.
ఈ మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నిద్రాణంలో ఉన్న ఆ శక్తిని మేల్కొపాలంటే.. ఇప్పుడో విజయం అవసరం. కర్ణాటక ఫలితం చూపించబోయే ప్రభావం అదే ! కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీకి భారీ బూస్టింగ్ ఇవ్వడం ఖాయం. కన్నడ ఎఫెక్ట్.. ఈ మూడు రాష్ట్రాల్లో రీసౌండ్ ఇవ్వడం ఖాయం. కలిసి కష్టపడాలే కానీ.. వెంట్రుకతోనూ కొండ లాగేయొచ్చు.. కర్ణాటక విజయంతో మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇదే అన్నది క్లియర్.