Karnataka Politics: కర్ణాటక ఓటమి నేర్పిన పాఠమేంటి? బీజేపీ ఇప్పటికైనా మారుతుందా ?
గెలుపుదేముంది ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.. ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో నీకు పరిచయం చేస్తుంది. నిజానికి ఓటమి చేసిన మేలు.. గెలుపు చేయదు ఎప్పుడూ ! కాకపోతే ఓటమి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాల్సింది అదే. కర్ణాటకలో విజయంతో దక్షిణాదిన దూసుకుపోవాలని ప్లాన్ చేసింది బీజేపీ.
ఐతే కన్నడ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో.. వంద జండూబామ్‌లు రాసుకున్న తగ్గని తలనొప్పి అంటుకుంది. అలాంటి ఓటమి నుంచి ఏం నేర్చుకుంటుంది.. ఏం చేయకూడదని తెలుసుకుంటుందన్న దాని మీదే.. బీజేపీ తర్వాత అడుగులు ఆధారపడి ఉంటాయ్. ఎన్నికలకు ముందు.. కర్ణాటకలో జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. డీకే శివకుమార్ మీద సీబీఐ, ఈడీ సోదాలు.. మాములుగా జరగలేదు రచ్చ. దర్యాప్తు సంస్థలను ప్రయోగించి.. ప్రత్యర్థి పార్టీని గ్రిప్‌లో పెట్టుకోవచ్చని బీజేపీ ప్రయత్నాలు చేసిందని వినిపించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి 2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయ్.
కట్ చేస్తే రెండేళ్లు తిరిగేసరికి.. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇదే ఎన్నికల్లో కమలం పార్టీని భారీగా దెబ్బతీసింది. బీజేపీ ప్రభుత్వాలను కూలుస్తుందని.. దర్యాప్తు సంస్థలను ప్రయోగించి భయపెట్టాలని చూస్తుందనే అంశాలను జనాల్లోకి పర్ఫెక్ట్‌గా తీసుకెళ్లింది కాంగ్రెస్. బాధితుడు చెప్పే మాటకు బలం ఎక్కువ ఉంటుంది. డీకే శివకుమార్ విషయంలో కర్ణాటకలో అదే జరిగింది. డీకే ప్రచారం చేసిన వంద నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు.. బీజేపీ వ్యతిరేక విధానాలు జనాల్లోకి ఎంతలా వెళ్లాయో ! తమకేం కావాలో ఓటర్లు ఈ ఫలితంతో క్లియర్‌గా చెప్పారు. కాషాయం పార్టీ వద్దని క్లారిటీ ఇచ్చేశారు.
బీజేపీ నేతలు చెప్పుకున్నట్లు.. కర్ణాటకలో కమలం పార్టీకి ఓటు శాతం మారకపోవచ్చు. ఐతే బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపించాయ్. ఒకటి ఒకసారి జరిగింది అంటే ఏదో అనుకోవచ్చు. ప్రతీసారి ప్రతీచోట అదే జరిగితే.. మొదటికే మోసం వస్తుంది. బీజేపీ విషయంలో అదే జరిగింది. కర్ణాటకతో సహా దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల సోదాలు.. ప్రభుత్వాల కూల్చివేతలు కన్నడ ఓటర్‌ను కదిలించాయ్. ఆలోచనలో పడేలా చేశాయ్.
తమకు కమలం వద్దు అని ఓటేసేలా ప్రేరేపించాయ్. దీనికితోడు బీజేపీ ప్రభుత్వం అవినీతి జనాల్లోకి మరింత వెళ్లింది. దీంతో కమలం పార్టీకి భారీ ఓటమి తప్పలేదు. కర్ణాటక ఫలితాల నుంచి ఇప్పటికైనా బీజేపీ మారాల్సిన అవసరం ఉంది. ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. దర్యాప్తు సంస్థలతో విపక్షాలను దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం.. అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వాలను కూల్చడం.. ఇలాంటి విధానాలు చెల్లిపోయాయ్. ప్రజలు అన్నీ గమనిస‌్తుంటారు. తమ అవకాశం కోసం ఓట్ల వరకు ఎదురుచూస్తారు. వాళ్ల రోజు.. ఇలాంటి ఫలితమే ఇస్తారు. కర్ణాటక ఫలితాల నుంచి బీజేపీ నేర్చుకోవాల్సింది ఇదే !