Karnataka BJP: కర్నాటకలో బీజేపీ ఖేల్ ఖతం..!?
కర్నాటకలో బీజేపీ పరిస్థితి ఏమంత గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది నేతలు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు స్వచ్చంధంగా విరమణ పాటిస్తున్నారు. మరికొందరు రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అనేక సమస్యలు కర్నాటక బీజేపీని వేధిస్తున్నాయి.
కర్నాటకలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నెలరోజుల్లోపే ఎన్నికలు జరగనుంది. దీంతో పార్టీలన్నీ అధికారం కోసం గట్టిగా పోరాడుతున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఆ పార్టీ పరిస్థితి ఏమంత గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది నేతలు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు స్వచ్చంధంగా విరమణ పాటిస్తున్నారు. మరికొందరు రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అనేక సమస్యలు కర్నాటక బీజేపీని వేధిస్తున్నాయి.
దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలనేది బీజేపీ ప్లాన్. ఇన్నాళ్లూ కర్నాటకలో ఆ పార్టీకి యడ్యూరప్ప అన్నీ తానై వ్యవహరించారు. అయితే పార్టీపై మొత్తం పెత్తనం యడ్యూరప్పదే అయిపోవడంతో జీర్ణించుకోలేకపోయిన హైకమాండ్ ఆయన్ను పక్కన పెట్టి బసవరాజ్ బొమ్మైని సీఎం పీఠంలో కూర్చోబెట్టింది. ఇది పార్టీకి మేలు చేసిందో కీడు చేసిందో అర్థం కాని పరిస్థితి ఉంది. యడ్యూరప్పను తప్పించినప్పటి నుంచి లింగాయత్ సామాజికవర్గం గుర్రుగా ఉంది. ఎన్నికల్లో లింగాయత్ వర్గానిదే నిర్ణయాత్మక పాత్ర. దీన్ని ఊహించని బీజేపీ హైకమాండ్ ఇప్పుడు మళ్లీ యడ్యూరప్ప జపం చేస్తోంది. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.
అన్ని పార్టీల కంటే లేటుగా బీజేపీ తన అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించింది. 189 మందితో కూడిన ఈ జాబితాలో 12 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించింది. 23 మందితో ప్రకటించిన రెండో లిస్టులో ఆరుగురికి సీట్లు దక్కలేదు. దీంతో వాళ్లంతా రగిలిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారందరికీ సీట్లు దక్కాయి. అయితే ఆ స్థానాల్లో ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకు మొండిచేయి చూపడంతో వాళ్లంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇది పార్టీకి పెద్ద సమస్యగా మారింది. సిట్టింగ్ మంత్రి అంగారకు సీటు నిరాకరించడంతో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మరోవైపు సీటు రాని కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో, మరికొందరు గాలి జనార్ధన్ రెడ్డితో టచ్ లో ఉన్నారు.
మరోవైపు పార్టీలో సీనియర్ లీడర్లకు సైతం సీట్లు దక్కలేదు. ఒకసారి ముఖ్యమంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జగదీశ్ శెట్టర్ కు సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన రగిలిపోతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పడంతో అధిష్టానం ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప పరిస్థితి కూడా ఇంతే. ఆయనకు కూడా సీటు నిరాకరించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాక ఆయనకు మద్దతుగా శివమొగ్గలో 19 మంది కార్పొరేటర్లు రాజీనామా చేశారు. ఇప్పటికే యడ్యూరప్ప వర్గీయులంతా తమకు ప్రాధాన్యం తగ్గిపోయిందని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండడంతో కమలం పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది పార్టీకి తీరని నష్టం చేకూర్చడం ఖాయం.