Karnataka Election: కాంగ్రెస్‌కు ఏం కలిసొచ్చింది? సీట్లు పెరగడం వెనుక రీజనేంటి?
ఇతర రాష్ట్రాల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ కర్ణాటకలో మాత్రం అధికారానికి దగ్గరగా వెళ్లనుంది. దీనిపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థ జరిపిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉండే అవకాశం ఉంది.
Karnataka Election: కర్ణాటకలో హంగ్ ఏర్పడనున్నట్లు అనేక సర్వేలు తేల్చినప్పటికీ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగనుంది. మెరుగైన సీట్లు సాధించబోతుంది. ఇతర రాష్ట్రాల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ కర్ణాటకలో మాత్రం అధికారానికి దగ్గరగా వెళ్లనుంది. దీనిపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థ జరిపిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 42 శాతం, బిజెపికి 36 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం ఓట్లు రావొచ్చు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా, బిజెపి 0.35 శాతం, జేడీ(ఎస్) 2.3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే సిద్ధరామయ్య అని 42 శాతం, బసవరాజ్ బొమ్మై అని 24 శాతం, కుమారస్వామి అని 17 శాతం, యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్ అని 3 శాతం మంది కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఆ పార్టీకి లాభం చేకూర్చింది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొంతవరకు ప్రభావం చూపగలిగింది.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య, గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. మరోవైపు ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ చేసిన 40 శాతం కమీషన్ సర్కారు ప్రచారం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభావంతో ఎస్సీలు కాంగ్రెస్ వైపు నిలిచారు. ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత వల్ల ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మరోవైపు బీజేపీ లేవనెత్తిన జై భజరంగ్‌బలి, టిప్పు సుల్తాన్, ఈద్గా మైదాన్ వంటి అంశాలు బీజేపీకి ఓట్లు తేలేకపోయాయి. బీజేపీ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా బీజేపీని దెబ్బతీసింది.