Amul vs Nandini Row‎: ‘నందిని’ చుట్టూ కర్ణాటక రాజకీయం.. అమూల్‌కు గట్టి ఎదురుదెబ్బ?

'నందిని' బ్రాండ్ కర్ణాటకకు చెందినది అయితే.. అమూల్ బ్రాండ్ గుజరాత్ కంపెనీది. అసలే ఎన్నికల వేడితో కర్ణాటక ఉడుకుతున్న వేళ తాము కర్ణాటకలో వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు అమూల్ బ్రాండ్ ప్రకటించడం దీనంతటికీ కారణమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2023 | 03:23 PMLast Updated on: Apr 17, 2023 | 3:23 PM

Karnataka Politics Around Nandini Hard Setback For Amul

Amul vs Nandini Row: పాల బ్రాండ్ కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పాల ఉత్పత్తి బ్రాండ్లు అయిన ‘నందిని’ వర్సెస్ అమూల్‌గా మారింది కర్ణాటక రాజకీయం. దీనికి కారణం ఉంది. ‘నందిని’ బ్రాండ్ కర్ణాటకకు చెందినది అయితే.. అమూల్ బ్రాండ్ గుజరాత్ కంపెనీది. అసలే ఎన్నికల వేడితో కర్ణాటక ఉడుకుతున్న వేళ తాము కర్ణాటకలో వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు అమూల్ బ్రాండ్ ప్రకటించడం దీనంతటికీ కారణమైంది. దీంతో కన్నడిగులు తమ సొంత బ్రాండ్ అయిన ‘నందిని’కి మద్దతిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌ను ఆదరించేదే లేదని తెగేసి చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక సిద్ధమైంది. వచ్చే నెల 10న ఓటింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు ప్రకటిస్తారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. జేడీఎస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీలు తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు దొరికిన అస్త్రమే ‘నందిని’. ఇది కర్ణాటక బ్రాండ్. ఇతర రాష్ట్రాల్లోనూ పాపులర్. బెంగళూరులో ‘నందిని’ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని తమ సొంత బ్రాండ్‌గా చూస్తారు. అయితే, ఇదే సమయంలో కర్ణాటకలో అడుగుపెట్టబోతున్నట్లు అమూల్ ప్రకటించింది. ముందుగా బెంగళూరులో ఆన్‌లైన్ ద్వారా తమ ఉత్పత్తిని విక్రయించబోతున్నట్లు అమూల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అమూల్ పాల ఉత్పత్తులు అనేక రాష్ట్రాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరు, కర్ణాటకలో తమకు మంచి ఆదరణ దక్కుతుందని అమూల్ భావించింది. కానీ, సీన్ రివర్స్ అయింది.
కన్నడిగుల వ్యతిరేకత
అమూల్ బ్రాండ్‌పై కర్ణాటక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీనికి కారణం ఇది గుజరాత్ బ్రాండ్ కావడమే. ప్రధాని మోదీ కూడా గుజరాతీ అనే సంగతి తెలిసిందే. దీంతో రెండింటికీ లింక్ చేసి, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టాయి. కన్నడ బ్రాండ్ అయిన ‘నందిని’కే తమ మద్దతు అని ప్రకటించాయి. గుజరాత్ బ్రాండ్ అమూల్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాయి. లోకల్ బ్రాండ్ ‘నందిని’ బెస్ట్ అంటూ.. అమూల్ వద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. దెబ్బకు అమూల్ వణికిపోయింది. తాము కర్ణాటకలో అడుగుపెట్టడం లేదని ప్రకటించింది. అయినప్పటికీ, ‘నందిని’ వర్సెస్ అమూల్ వివాదం మాత్రం ముగియలేదు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుంది. అంతకుముందు పెరుగును దహీ అనాలంటూ కూడా కేంద్రం ఆదేశించడంపై తమిళనాడుతోపాటు, కర్ణాటక కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని కేంద్రన్ని దుయ్యబట్టాయి స్థానిక పార్టీలు. ఈ నేపథ్యంలో ఇప్పటి రాజకీయాలు పాలు, పెరుగు చుట్టూ తిరుగుతుండటం విశేషం.

Karnataka
రాహుల్ గాంధీ సపోర్ట్
కర్ణాటకలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ టాప్ బ్రాండుగా కొనసాగుతున్న ‘నందిని’కి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ‘నందిని’ బ్రాండు గురించి గొప్పగా చెప్పారు. ఆదివారం కర్ణాటకలో పర్యటించిన రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఒక షాపులో అమ్ముతున్న ‘నందిని’ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేశారు. ‘నందిని’ బ్రాండ్ కర్ణాటకకు గర్వకారణం అన్నారు. మరో ప్రతిపక్షం జేడీఎస్ కూడా అమూల్‌ ఎంట్రీపై విమర్శలు గుప్పించింది. అమూల్ కర్ణాటకలోకి అడుగుపెట్టడం ద్వారా ‘నందిని’ బ్రాండ్ లేకుండా చేయాలనుకుంటున్నారని జేడీఎస్ ఆరోపించింది. ‘నందిని’కి అనుమతించిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై కన్నడ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ స్పందించింది. అమూల్ ద్వారా ‘నందిని’ బ్రాండ్‌కు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపింది.
‘నందిని’ ఒక ఎమోషన్
కర్ణాటకలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్ ‘నందిని’. ఎక్కువ మంది ఇళ్లలో ‘నందిని’ బ్రాండ్ పాలు, పాల ఉత్పత్తులే వాడుతారు. అక్కడివాళ్ల ఫస్ట్ ఛాయిస్ కూడా ఇదే. ఇతర బ్రాండ్లతో పోలిస్తే ‘నందిని’ ధరలు తక్కువగా ఉంటాయి. నాణ్యతలోనూ రాజీలేని బ్రాండ్. అందువల్లే కన్నడిగుల ఇళ్లలో ‘నందిని’ ఒక భాగమైంది. ‘నందిని’ అంటే బ్రాండ్ కాదు.. ఒక ఎమోషన్ అంటున్నారు అక్కడి వాళ్లు.