Kaveri Issue: కర్ణాటక, తమిళనాడు మధ్య నీళ్ల మంటలు.. కావేరి నదీ వివాదం ఏంటి.. పరిష్కారం ఎలా..?

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ దాదాపు 3వందలకు పైగా సంస్థలు బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయ్. జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కావేరీ జలాల విడుదలపై వివాదం నెలకొన్న వేళ.. తమిళ రైతులు తీవ్ర నిరసనలకు దిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 06:20 PMLast Updated on: Sep 26, 2023 | 6:20 PM

Kaveri River Water Dispute Between Karnataka Tamil Nadu Ties Explained

Kaveri Issue: తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ నది జలాలు.. మంటలు రేపుతున్నాయ్. కర్ణాటక ప్రభుత్వం.. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ దాదాపు 3వందలకు పైగా సంస్థలు బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయ్. జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కావేరీ జలాల విడుదలపై వివాదం నెలకొన్న వేళ.. తమిళ రైతులు తీవ్ర నిరసనలకు దిగారు. కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులకు అంతిమ సంస్కారం చేస్తూ నిరసన తెలిపారు. కర్నాటక ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియచేస్తూ నోట్లో.. చచ్చిన ఎలుకలను ఉంచుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు.

కావేరీ జలాలను వెంటనే తమిళనాడుకు విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. నిరసనలు పీక్స్‌కు చేరుకుంటున్న వేళ.. అసలీ వివాదం ఏంటి.. ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరమీదకు వచ్చిందనే చర్చ సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. కర్ణాటక, తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఇప్పటిది కాదు. బ్రిటీష్​పాలన నాటి నుంచి ఉంది. అప్పట్నుంచి ఇది రెండు రాష్ట్రాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. నదీ జలాల కేటాయింపే శతాబ్దాలుగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య! 1924లో ఈ నీటి వివాదంపై ఒప్పందం కుదిరింది. నాటి మైసూర్​ రాష్ట్రం, మద్రాస్​ ప్రెసిడెన్సీలు.. రాజీకి వచ్చాయ్. ఈ ఒప్పందం ప్రకారం.. కన్నంబది గ్రామంలో ఓ డ్యామ్​నిర్మించుకునే చాన్స్‌ మైసూర్‌కు లభించింది. 44.8 వేల మిలియన్​ క్యూబిక్‌ అడుగుల నీటిని నిల్వ చేసుకునే విధంగా డ్యామ్‌ రూపొందించుకోవచ్చని ఒప్పందంలో ఉంది. ఐతే 50 ఏళ్ల తర్వాత దీన్ని రివ్యూ చేయాలని కూడా ఉంది. ఆ ఒప్పందం తర్వాత కొంతకాలానికి ఈ వివాదం క్లియర్ అయింది.

ఐతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. నీళ్ల జగడం మరింత ముదిరింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయినా పెద్దగా ఫలితం దక్కలేదు. 1990లో అప్పటి కేంద్ర ప్రభుత్వం CWDT పేరుతో ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరి మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించడమే ఈ ట్రిబ్యునల్​ లక్ష్యం. వీటిపై దర్యాప్తు చేపట్టిన CWDT.. నెలవారీగా లేదా వారంలో ఒకసారి 205 మిలియన్​ క్యూబిక్​ అడుగుల నీటిని తమిళనాడుకు విడిచిపెట్టాలని కర్ణాటకకు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. తమకే సరిగ్గా నీళ్లు లేవని.. ఇతర రాష్ట్రానికి ఎలా ఇవ్వాలని కర్ణాటక అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం అప్పటి నుంచి రగులుతూనే ఉంది. ఇప్పుడు బెంగళూరు బంద్‌ వరకు వెళ్లింది. బెంగళూరు బంద్‌కు.. అధికార కాంగ్రెస్​మద్దతివ్వలేదు. కావేరీ నదీ జలాల వివాదం తీవ్రత తమకు తెలుసని.. ఈ విషయంపై రాజకీయాలు పక్కనపెట్టి, అందరు కలిసి చర్చలు జరపాలని కాంగ్రెస్ అంటోంది.