కేరళ లిక్కర్ స్కాంలో కవిత ,మళ్లీ తిహార్ జైలుకేనా?
మొన్నటి వరకూ కూసీఆర్‌ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం మాదిరిగానే ఇప్పుడు మరో స్కాం బీఆర్ఎస్ పార్టీ మీదకు దూసుకొస్తోంది. కేరళ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో సమస్య సర్దమనిగిందిలే అనుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీలో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలయ్యింది.
మొన్నటి వరకూ కేసీఆర్‌ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం మాదిరిగానే ఇప్పుడు మరో స్కాం బీఆర్ఎస్ పార్టీ మీదకు దూసుకొస్తోంది. కేరళ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో సమస్య సర్దమనిగిందిలే అనుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీలో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాం బీఆర్‌ఎస్ పార్టీని ఏ స్థాయిలో కుదిపేసిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడి కూతురే స్కాంలో అరెస్ట్ అవ్వడంతో పార్టీ శ్రేణులు మొత్తం అయోమయంలో పడ్డాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే ఆరోపణలను విమర్శలను ఎదుర్కోలేక చాలా మంది తలలు దించుకున్నారు. తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా.. గట్టిగా మాట్లాడితే తెలంగాణ బతుకమ్మగా కవితను ఎలివేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి కవిత ఎటూ కానీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడంతో.. కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది.
ఈ విషయంలో కవితను కేసీఆర్ ఇంటికి పిలిపించుకుని మరీ తిట్టాడంటూ వార్తలు వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత బెయిల్ మీద బయటకు వచ్చింది. కొన్నాళ్లపాటు రాజకీయాలకు పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంది. కానీ ఈ మధ్యే మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాం సమస్య తీరిందిలే అనుకునేలోపే ఇప్పుడు మరో సమస్య కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడూతూ వస్తోంది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని.. దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించారు. మలప్పురంలోని ఎడవన్నలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మరీ లిక్కర్ స్కాం గురించి వివరాలు చెప్పారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ‘‘అప్పట్లో పాలక్కడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి, ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేశ్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు’’ ఇవి సతీషన్ చేసిన ఆరోపణలు. క్యాబినెట్ నోట్ ఆధారాంగానే తాను ఈ ఆరోపణలు చేస్తున్నానంటూ చెప్పారు. తాను చేసినవి అసత్య ఆరోపణలైతే మంత్రులు వాటిని ఎందుకు ఖండించలేదంటూ చెప్పారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియకుండా చేశారట. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్‌లోని డిస్టిలరీలకు కూడా తెలియదు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే.. ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయి. ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆయన చెప్తున్నారు. ఈ విషయం మాట్లాడేందుకు కవిత కేరళకు వచ్చి అక్కడే కొన్ని రోజులు ఉన్నారంటూ చెప్పారు. ఎక్కడ స్టే చేశారు.. ఎవరితో మాట్లాడారు.. ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు అనే విషయాలను త్వరలోనే చెప్తామన్నారు.
సతీషన్ చేసిన ఆరోపణలు బట్టి చూస్తే ఢిల్లీలో ఏం జరిగిందో కేరళలో కూడా అదే జరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హెల్సేల్ ధర 166 రూపాయలు అయితే.. కొత్త విధానంలో 188కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని 223 నుంచి నామమాత్రంగా ఒక రూపాయి 88 పైసలకు, వ్యాట్‌ను 106 నుంచి ఒక రూపాయి 90 పైసలకు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను 33 రూపాయల నుంచి ఏకంగా 363 కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా ఈ పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హెూం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలకు అప్పగించింది.
ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈడీ, సీబీఐ ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేశాయి. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ. వందల కోట్లు ముడువులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగకు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ ఆమెను అరెస్టు చేసింది. దాదాపు 5 నెలల న్యాయ పోరాటం తరువాత కవితకు బెయిల్ వచ్చింది. దీంతో ఒక సమస్య తప్పింది అనుకునేలోపే మరో సమస్య మొదలయ్యింది.
ఇప్పుడు కేరళ లిక్కర్ స్కాం విషయంలో కూడా కవిత పేరు వినిపిస్తోంది. ఏ కంపెనీకి లాభం కలిగేలా కవిత వ్యవహరించిది అని చెప్తున్నారో ఆ కంపెనీ మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పంజాబ్‌లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులు కూడా ఉన్నాయి. దీంతో మరోసారి కల్వకుంట్ల కుటుంబానికి ఈ కేసు సమస్యలు తెచ్చే అవకాశం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితే సతీషన్ చేస్తున్న ఆరోపణలను కవిత కొట్టిపారేశారు. తనకు ఆ కేస్‌కు ఎలాంటి సబంధం లేదంటూ చెప్పారు. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో కూడా కవిత ఇదే చెప్పారు. కానీ అటు తిరిగీ ఇటు తిరిగీ జైలుకే వెళ్లారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.