అసెంబ్లీకి కేసీఆర్ ! అసెంబ్లీ అదిరిపోవాల్సిందే
బీఆర్ఎస్ నేతలతో వరుసగా భేటీలు సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ? ఇప్పుడు ఇదే అధికార ప్రతిపక్ష పార్టీలో అత్యంత ఆసక్తిగా మారిన విషయం. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఒకటి రెండు సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు.
బీఆర్ఎస్ నేతలతో వరుసగా భేటీలు సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ? ఇప్పుడు ఇదే అధికార ప్రతిపక్ష పార్టీలో అత్యంత ఆసక్తిగా మారిన విషయం. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఒకటి రెండు సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… పద్దు ప్రవేశపెట్టిన తొలిరోజు సభకు వచ్చిన కేసీఆర్, మీడియా పాయింట్ దగ్గర, ప్రభుత్వతీరును ఎండగట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్‌మీట్లు గాని నిర్వహించలేదు. అసెంబ్లీని కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అని సర్వత్రా ఆసక్తినెలకొంది. అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయమివ్వాలని మొదట్నుంచీ చెబుతున్న కేసీఆర్ ఆ సమయం గడిచాకే బయటకు వస్తారని చెబుతున్నారు బీఆర్‌ఎస్ కీలక నేతలు.
ప్రజల తరపున కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి… కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఆయన రాకపై, బీఆర్‌ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ? ఏయే బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు ? అనే విషయాలపై పూర్తిషెడ్యూల్ తెలిసాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా, ఆయనకు తగిన ప్రాధాన్యత ఉంటుందా ? సభలో కేసీఆర్‌కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా ? అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. ఎన్ని అవమానాలు కేసులు భరించారో కూడా చూసింది. అన్ని బాధల నుంచి పట్టుబట్టి మరీ కాంగ్రెస్‌ను ఏకం చేసి విజయం సాధించాడు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు సీఎం పదవిలో ఆయనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్‌కు అసెంబ్లీలో అవమానం తప్పదనే భావనలో పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా, అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా గెలుస్తోంది. మరి, గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.