T BJP: టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు ప్రచారం వెనుక కేసీఆర్.. బీజేపీ నేతల ఆరోపణ
అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు.. డీకే అరుణ నియామకం.. ఈటలకు ప్రచార సారథి పదవి.. బండివకి కేంద్ర మంత్రి పదవి అంటూ అనేక ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. తీరా చూస్తే అవన్నీ వట్టివే అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.
T BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే బీజేపీ నేతలు కూడా వ్యవహరించారు. ఒక్కొక్కరుగా వరుసపెట్టి ఢిల్లీ వెళ్లి, పార్టీ పెద్దలను కలిశారు. అందరూ బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారని ప్రచారం జరిగింది. ఇక విజయశాంతి వంటి నేతలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు.
కొందరు బీజేపీ నేతలు.. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది అనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు.. డీకే అరుణ నియామకం.. ఈటలకు ప్రచార సారథి పదవి.. బండివకి కేంద్ర మంత్రి పదవి అంటూ అనేక ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. తీరా చూస్తే అవన్నీ వట్టివే అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. బీజేపీలో గందరగోళం సృష్టించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విజయశాంతి, జితేందర్ రెడ్డి వంటి వాల్లు విమర్శించారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో ఆ పార్టీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు.
మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతితోపాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. బీజేపీలో ఇలాంటి లీకుల సంస్కృతి లేదు. ఇది నిజమే. చాలా వరకు బీజేపీ స్పష్టమైన నిర్ణయాలే తీసుకుంటుంది. ముందుగా లీకులిచ్చి, తర్వాత అమలు చేయడం వంటివి బీజేపీలో పెద్దగా కనిపించదు. మరోటి.. ఈటలకు ప్రచారసారథి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉట్టిదే అంటున్నారు. అసలు బీజేపీలో అలాంటి పదవే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రచారానికి ప్రత్యేక పదవి తమ పార్టీలో లేదని చెబుతున్నారు. బండి సంజయ్‌ను మారుస్తారనే ప్రచారంపైనా ఆ పార్టీ స్పందించింది. సీనియర్ నేత విజయశాంతి మాట్లాడుతూ.. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్‌నే అధ్యక్షుడిగా కొనసాగుతారని, అధ్యక్షుడిని మార్చబోరని, ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పార్టీలో ఎవరికీ ఉన్నట్లుండి పదవులు ఇవ్వబోరని స్పష్టం చేశారు. కష్టపడేవారికే పార్టీ పదవులు దక్కుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామన్నారు. పార్టీ బలోపేతంపై చర్చించామని, పార్టీలో ఎవరికీ, ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. పొంగులేటి, జూపల్లి.. ఏ పార్టీలో చేరాలో వాళ్ల ఇష్టమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.