KCR Survey: కేటీఆర్, హరీష్‌రావుపై.. కేసీఆర్ సర్వే రిపోర్ట్..!
దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాలలో ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉందని మీడియాకు లీకైన బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్స్ లో ఉందని చర్చ జరుగుతోంది. ఈ 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 25 మందికి వచ్చే పోల్స్ లో అసెంబ్లీ టికెట్స్ ఇచ్చినా గెలవరని సర్వే రిపోర్ట్స్ తేల్చి చెప్పాయట.
ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ కేసీఆర్ సీక్రెట్ గా చేయించుకున్న సర్వే రిపోర్ట్స్ పై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ నడుస్తోంది. ఆ రిపోర్ట్స్ లోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల చిట్టా మొత్తం ఉందనే టాక్ వినిపిస్తోంది. దాని ఆధారంగానే రాష్ట్రంలో ఎక్కడెక్కడ, ఎవరెవరికి బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్స్ ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ డిసైడ్ చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సర్వేలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిపోర్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావులపై సర్వే రిపోర్ట్స్ ఏం చెప్పాయనేది ఆసక్తి కలిగిస్తోంది.
కేసీఆర్ ను మించి కేటీఆర్, హరీశ్ రావు..?
ఈసారి ఎన్నికల్లో హరీష్, కేటీఆర్ లు ఓడిపోయే ప్రమాదం లేదని సర్వే రిపోర్ట్ లో వచ్చింది. అయితే వారిద్దరి మెజారిటీ గణనీయంగా తగ్గుతుందని నివేదిక వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఓటమి చవిచూడని రికార్డు హరీష్, కేటీఆర్‌లకు ఉంది. 2004 నుంచి సార్వత్రిక ఎన్నికలు, ఉపఎన్నికలు కలిపి హరీశ్ రావు సిద్దిపేట నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 నుంచి సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా సిరిసిల్ల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ అత్యధిక మెజారిటీ సైతం సాధించారు. హరీష్ అత్యధికంగా 1,18,699 ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా, కేటీఆర్ 88,886 ఓట్ల భారీ మెజారిటీతో 3వ స్థానంలో నిలిచారు. 2018లో గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కూడా.. కేటీఆర్, హరీశ్ రావు రేంజ్ లో మెజారిటీ సాధించలేకపోయారు. 58,290 ఓట్ల మెజారిటీ మాత్రమే కేసీఆర్ కు వచ్చింది. ఈవిధంగా అప్రతిహతంగా గెలుస్తున్న హరీశ్, కేటీఆర్‌పై సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుందని.. ఈ ఒక్క కారణమే వచ్చే పోల్స్ లో వారి మెజారిటీని తగ్గించే ఛాన్స్ ఉందని సర్వేలో గుర్తించారని అంటున్నారు.
ఆ 25 మందికి టికెట్స్ ఇచ్చినా గెలవరా..?
2018 అసెంబ్లీ పోల్స్ లో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 88 సీట్లను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ గెల్చుకుంది. అయితే వీరిలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాలలో ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉందని మీడియాకు లీకైన బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్స్ లో ఉందని చర్చ జరుగుతోంది. ఈ 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 25 మందికి వచ్చే పోల్స్ లో అసెంబ్లీ టికెట్స్ ఇచ్చినా గెలవరని సర్వే రిపోర్ట్స్ తేల్చి చెప్పాయట. టికెట్ల కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రయారిటీ ఇస్తామని కేసీఆర్ పైకి చెబుతున్నా.. కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉన్న ఈ తరుణంలో సాధ్యమైనంత తక్కువ ప్రజా వ్యతిరేకత ఉన్నవాళ్లనే బీఆర్ఎస్ బరిలోకి దింపుతుందని పరిశీలకులు అంటున్నారు.