KCR: ‘ఆ నలుగురు’ ఎవరు..? కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ..!
నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలలో కారు పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. దీనిపై ఇప్పటికే తన ఫాం హౌస్‌లో గులాబీ బాస్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం.
KCR: బీఆర్ఎస్ పార్టీ 115 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎంతైతే ఉత్కంఠ ఆవరించిందో.. నేడో, రేపో 4 స్థానాలకు కేసీఆర్ ప్రకటించనున్న అభ్యర్థుల పేర్లపైనా అంతే రేంజులో ఉత్కంఠ నెలకొంది. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలలో కారు పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. దీనిపై ఇప్పటికే తన ఫాం హౌస్‌లో గులాబీ బాస్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం. నర్సాపూర్‌లో సునీతా లక్ష్మీరెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, నాంపల్లిలో ఆనందగౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖాయమయ్యే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే నాంపల్లి, గోషా మహల్ స్థానాల్లో అభ్యర్థులు మారే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
6 సెంటిమెంట్‌తో..
అయితే ఈ నాలుగు సీట్లను పెండింగ్‌లో ఉంచడానికి కూడా సంఖ్యాశాస్త్రంపై కేసీఆర్‌కు ఉన్న సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. గులాబీ బాస్‌కు 6 సెంటిమెంట్ ఎక్కువని.. ఆ లెక్కలో భాగంగానే తొలుత 115 అసెంబ్లీ సెగ్మెంట్లకు క్యాండిడేట్లను అనౌన్స్ చేశారనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇబ్బంది వచ్చిందనే ఉద్దేశంతోనే.. 4 టికెట్లను పెండింగులో పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈవిషయం అర్ధం కాక ఆ నాలుగు స్థానాల ఆశావహులు అనవసర టెన్షన్‌కు, ఉత్కంఠకు గురయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వ్యతిరేకత.. వయోభారం..
జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలించారు. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన పల్లాకే టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారట. కేటీఆర్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భవిష్యత్తులో మరేదైనా మంచి అవకాశమిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. వయోభారం అనేది నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి పెద్ద మైనస్ పాయింట్ అయింది. దీంతో అక్కడి నుంచి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్‌ను కేసీఆర్ ఓకే చేశారట. మదన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారట. గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఆర్ఎస్ తరఫున ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నందకిషోర్ వ్యాస్‌కు అక్కడి నుంచి ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ చేశారట.
119 మందితో కేసీఆర్..
ఈ నాలుగు స్థానాలను ఖరారు చేసిన తర్వాత మొత్తం 119 మంది అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్టీలోని అసంతృప్తులతో వ్యవహరించాల్సిన తీరు.. ప్రచార ప్రణాళికలు, విపక్షాలపై స్పందించాల్సిన అంశాలు తదితర వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్ రావుపై వివాదాస్పద కామెంట్స్ చేసిన మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ శంభీపూర్‌రాజు వెయిట్ చేస్తున్నారు.