KCR AP Strategy: వైసీపీ, టీడీపీ చేతకానితనం.. రంగంలోకి దిగుతున్న కేసీఆర్!
అన్ని పార్టీలూ కేంద్రంలోని బీజేపీ మోచేతి నీళ్లు తాగి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నవే. ఎంతసేపూ బీజేపీ తమను ఎప్పుడు కరుణిస్తుందా.. కేసులు నుంచి బయటపడేస్తుందా.. తమతో పొత్తు పెట్టుకునేందుకు పిలుపు వస్తుందా.. అని ఎదురు చూసే పార్టీలే తప్పా కమలం పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పే పార్టీ ఒక్కటి కూడా ఏపీలో లేదు.
మన తప్పులే మరొకరికి అవకాశాలు కల్పిస్తాయని చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేంద్రలోని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నాయి. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సహా విభజన చట్టంలోని అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలమవుతున్నాయి. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకుని ఏపీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోవద్దంటూ కేసీఆర్ త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖలో స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి ఎంతో మంది అప్పట్లో బలిదానాలు చేశారు. భూములు విరాళమిచ్చారు. అప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఇప్పుడు నష్టాల పేరుతో ఈ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆరు నూరైనా దీన్ని ప్రైవేటీకరించకుండా ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఏడాదికాలంగా ఉద్యమిస్తున్నా ప్రయోజనం శూన్యం. వాళ్ల మొర ఆలకించేవారే లేరు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు తూతూమంత్రంగా చెప్తున్నాయి తప్ప దాన్ని అడ్డుకునేందుకు స్పష్టమైన కార్యాచరణ ఆ పార్టీల దగ్గర లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గట్టిగా ఉద్యమించిన పార్టీ ఒక్కటి కూడా లేదు. అన్ని పార్టీలూ కేంద్రంలోని బీజేపీ మోచేతి నీళ్లు తాగి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నవే. ఎంతసేపూ బీజేపీ తమను ఎప్పుడు కరుణిస్తుందా.. కేసులు నుంచి బయటపడేస్తుందా.. తమతో పొత్తు పెట్టుకునేందుకు పిలుపు వస్తుందా.. అని ఎదురు చూసే పార్టీలే తప్పా కమలం పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పే పార్టీ ఒక్కటి కూడా ఏపీలో లేదు. ఇదే బీజేపీ అహంకారానికి, అధికార మదానికి కారణమవుతోంది.
సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ ఇప్పటికే కేటీఆర్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. విశాఖ ఉక్కు – తెలుగోడి హక్కు పేరిట బీఆర్ఎస్ త్వరలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోంది. విశాఖలో ఈ నెలలోనే భారీ బహిరంగసభను నిర్వహించనుంది. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు కేసీఆర్. దీని ద్వారా ఏపీలో పాగా వేయాలనేది కేసీఆర్ ప్లాన్. అంతేకాదు.. రాష్ట్ర విభజనకు కారణమైన వ్యక్తిగా తనపై ఏపీలో ఉన్న అపవాదును కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. అప్పుడైనా వైసీపీ, టీడీపీ, జనసేనలకు బుద్ధి వస్తుందేమో చూడాలి.