ఢిల్లీలో కేసీఆర్ ప్రెస్ మీట్.. స్వింగ్ లోకి వచ్చిన దొరగారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై... ఆయన జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై… ఆయన జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలను జాతీయ మీడియాలో బయట పెట్టేందుకు కేసిఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా బయటకు రాని కెసిఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు రాకపోతే గులాబీ పార్టీ కచ్చితంగా ఇబ్బందులు పడుతుంది. అందుకే దీనిని గమనించిన కేసీఆర్ బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ నేతలకు కూడా ఇప్పటికే కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇకనుంచి ప్రజా ఉద్యమాల విషయంలో పార్టీ నేతలు అందరూ సీరియస్ గా ఉండాలని, ఉద్యమం సమయంలో ఏ విధంగా వ్యవహరించామో ఇప్పుడు కూడా అదే విధంగా పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని, నియోజకవర్గాల్లో పోరాటాలు గ్రామస్థాయి నుంచి జరగాలని కెసిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కేసిఆర్ ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్టు తెలుస్తుంది. జాతీయ మీడియాకు కూడా ఇప్పటికే కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వచ్చేనెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సీఎం గా ఉన్నప్పుడు కెసిఆర్ నిర్వహించిన మీడియా సమావేశాలకు జాతీయస్థాయిలో హడావుడి జరిగేది. కరోనా సమయంలో ఆయన ప్రసంగాలను జాతీయస్థాయిలో వైరల్ చేశారు. ఇప్పుడు కెసిఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడబోతున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడగలిగే కేసిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడతారు అనేది చూడాలి.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తన విషయంలో దూకుడుగా ఉండటంతో కాస్త శాంతింప చేసే దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అనే విషయంలో కేసీఆర్ కాస్త ముందుంటారు. ఇప్పుడు ఇదే కోణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవసరమైతే బీజేపీతో కూడా దగ్గర కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.