KCR vs TAMILISAI: గవర్నర్ కి కోర్టులు ఆదేశాలు ఇస్తాయా..?
గవర్నర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న పనితీరును గమనిస్తూ.. విద్యావ్యవస్థకు సంబంధించిన యూనివర్సిటీల స్థితిగతులను ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే పాలకులు సరిదిద్దుకునేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వ్యవస్థ. దీనిని ఇటీవలె కాలంలో కొందరు పాలకులు నీరుగారుస్తూ వచ్చారు. ఇలాంటి చర్యను హేయమైనదిగా చెప్పాలి. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయాన్ని అవలంభించారు.
ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ రాంలాల్ తో గొడవపడేవారు. ఆతరువాత గవర్నర్ రాంలాల్ ను పదవినుంచి బదిలీ చేశారు. ఈ గవర్నర్ వ్యవస్థ రాష్ట్రపతి వ్యవస్థ వద్దని ఎన్టీఆర్ అన్నారు. కానీ అది పార్లమెంట్ లో చర్చనీయాంశం అయ్యింది. చివరికి ఒప్పుకొలేదు. దీనిని కొనసాగించాలని తీర్మానించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా గతంలో దీనిపై పోరాడారు. ఢిల్లీ లో రాష్ట్రపభుత్వనికి సంపూర్ణ అధికారాలు లేవని ఈ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యవస్థను తొలగించి రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్రం అంగీకరించలేదు. దీనికి కారణం ఢిల్లీ దేశరాజధాని నగరం అక్కడికి ఎందరో విదేశాలనుంచి వచ్చి పోతూ ఉంటారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉద్దేశ్యంతో.. దీనిని కేంద్రం పరిధిలో ఉంచుకుంది. ఇలాంటి వాతావరణం పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ఉంది. అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ కు గవర్నర్ రవీంద్రనారాయణ రవి మధ్య సయోధ్య కుదరడం లేదు. స్టాలిన్ క్యాబినెట్ ఆమోదించిన కొన్ని పేరాలు నేను చదవను అంటూ జాతీయగీతాలాపన కంటే ముందే వెళ్లిపోయారు. కేరళ విషయానికొస్తే అక్కడి గవర్నర్ ఆర్థిక మంత్రిపై ఉన్న ఒత్తిడిని ఉపసంహరించుకుంటున్నా అన్నారు. అలాగే బెంగాల్ గవర్నర్ కూడా మమతా సర్కార్ ను ఏవిధంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిందో చూశాం.
ఇక పోతే మన తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళసై కి మధ్య సఖ్యత కొరవడింది. కేసీఆర్ గతంలోని గవర్నర్ లతో చాలా మంచిగా ఉండేవారు. అప్పటి నరసింహన్ తో తరచూ వెళ్లి ప్రభుత్వ విధివిధానాల గురించి చర్చించే వారు. టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా ప్రమాణస్వీకారం చేయించారు. ఆనవాయితీగా వచ్చే జాతీయ పండుగలకు ఆహ్వానం పంపించే వారు. వాటికి తగిన ఏర్పాట్లు కూడా చేసేవారు. తమిళసై వచ్చిన కొత్తలో కూడా చాలా మంచిగా ఉండేవారు. బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం అందితే హాజరయ్యారు. ఇంత సజావుగా సాగుతున్న వీరి బంధానికి ఎందుకు గండిపడటం వెనుక బలమైన రాజకీయ కారణాలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మొదట్లో కోవిడ్ కారణంగా రాజ్ భవన్ కి దూరం అయ్యారు. కోవిడ్ తరువాత ఎలాంటి సాకు దొరకలేదు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డిని తమ ఎమ్మెల్సీగా నియమించాలని కేసీఆర్ కోరడం. అతనికి ఏదో ఒక పదవిని రాజకీయంగా కట్టబెట్టాలని అనుకోవడం. దీనికి గవర్నర్ తిరస్కరించడం జరిగింది. ఎందుకు కేసీఆర్ ఇలా చేయాలనుకున్నాడంటే అప్పటి హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ పొరపెచ్చులు వచ్చాయి. ఈ విభేదాలు క్రమక్రమంగా వ్యక్తిగతంగా మారిపోయాయి. ఎంతలా అంటే బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం. జాతీయ పండుగలకు పిలువకపోవడం. అసలు గవర్నర్ ను లెక్కచేకుండా ప్రవర్తించడం వరకూ వెళ్లింది. గతంలో విశ్వవిద్యాలయాల్లో కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ విషయంలో కూడా గవర్నర్ ప్రభుత్వ ఫైల్ ను ఆమోదించకుండా తనకు కొన్ని సందేహాలున్నాయని పెండింగ్ లో పెట్టారు. సందేహాలు ఉన్న వాటిపై వివరణ ఇవ్వడం కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికూడా గవర్నర్ ని వెళ్లి కలిశారు. తాజాగా మీరే గణతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం రాజ్ భవన్ కు లేఖ పంపడం. దీనిపై గవర్నర్ స్పందించి రాష్ట్రపతికి ఈ లేఖను పంపుతా అనడం. మీడియా ముఖంగా చిట్ చాట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం పై విమర్శించడం. ఇలా ఈ గొడవను తారా స్థాయికి తీసుకెళ్లాయి.
ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపాల్సి ఉండగా.. తమిళిసై నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో నేడు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ప్రభుత్వం రంగంలోకి దించింది. బడ్జెట్‌కు గవర్నర్ తక్షణం ఆమోదం తెలిపేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఇతర విషయాల్లో సరే కానీ, బడ్జెట్ ఆమోదం విషయంలో గవర్నర్ విచక్షణకు తావుండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌కు ఆమోదం విషయమై ఈ నెల 21నే రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌కు లేఖ పంపింది. అయినప్పటికీ ఆమోదం తెలపకపోవడంతో కోర్టును ఆశ్రయించడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గవర్నర్ ప్రసంగం ఉండడం అనేది అత్యవసరం కాదని కూడా చెబుతున్నారు. గతేడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే సాధారణంగా రాష్ట్రంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించే అధికారం కల్గిన గవర్నర్ పై కోర్టులు ఆదేశాలు ఇస్తాయా అన్నది ప్రతి ఒక్కరికీ ఆసక్తికల్గించే అంశం. అలాగే కోర్టులు గవర్నర్‌ను ఆదేశించలేవన్న విషయం గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించనుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏది ఏమైనా గవర్నర్ పై ప్రభుత్వాలు ఇలా చేయడం సరైన పద్దతి కాదు. అలాగని బిజెపీ పరిపాలించని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇలా పరిపాలించే వ్యవస్థలను ఆడుకోవడం అనేది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తి విరుద్దంగా చెప్పాలి. అలాగే గవర్నర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాలను ప్రత్యేక్షంగా విమర్శించడం అనేది సరైన విధానం కాదు. రాష్ట్రంలో తమ పరస్పర వివాదాలను పక్కనపెట్టి ప్రజలకోసం వారివారి విధులను క్రమశిక్షణతో పాఠించాలంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.