BRS: బీఆర్ఎస్‌కు ఏడాది.. జాతీయ పార్టీ కథ ముగిసిందా..? బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగమా..?

బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు.. ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 4, 2023 | 03:01 PMLast Updated on: Oct 04, 2023 | 3:01 PM

Kcrs Brs Party Failed To Emerge As A National Party

BRS: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. గత ఏడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఏర్పడింది. జాతీయ పార్టీగా మారి ఏడాదైనా.. తెలంగాణ మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు.. ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన తొలి నాళ్లలో చాలా హడావిడి కనిపించింది. వివిధ రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమాజ‌్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ తరఫున కుమార స్వామి, ఇతర నేతలు కేసీఆర్‌తో చేతులు కలిపినట్లు కనిపించారు. కానీ, ఏడాదిలోపే ఎవరూ కేసీఆర్‌ను పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై కొద్దిగా ఫోకస్ చేసినట్లు కనిపించింది. తెలంగాణ సమీప ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కాన్వాయ్‌తో వెళ్లి, అక్కడ సమావేశాలు పెట్టారు. మహారాష్ట్రకు చెందిన నేతల్ని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే.. సోలాపూర్‌లో బీఆర్ఎస్ ఆఫీసుకు రెంట్ కూడా కట్టడం లేదట. స్థానిక నేతలు కూడా పార్టీని, ఆఫీసును పట్టించుకోవడం లేదు. అంటే మహారాష్ట్రలో పార్టీని కేసీఆర్ వదిలేసుకున్నట్లే.

మరో పొరుగు రాష్ట్రం ఏపీకి కూడా అధ్యక్షుడిని నియమించారు కేసీఆర్. అయితే, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడుందో గూగుల్‌లో చూసి వెతుక్కోవాల్సిందే. ఏపీలో బీఆర్ఎస్‌‌ను పట్టించుకున్న వాళ్లే లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్లు కూడా పార్టీవైపు కన్నెత్తి చూసిందే లేదు. నాయకులే పట్టించుకోని బీఆర్ఎస్‌కు ఏపీలో ఆదరణ ఎక్కడుంటుంది. అదీగాక.. అక్కడి రాజకీయాల గురించి తమకేం సంబంధం అన్నట్లు ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత చేటు చేశాయి. పోనీ.. ఏపీకి చెందిన తెలుగుదేశం వంటి పార్టీలు ఇక్కడికొస్తే మాత్రం ఆంధ్రా పార్టీలు మనకెందుకూ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే వీళ్లు మాత్రం మహారాష్ట్ర, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేయొచ్చు. కానీ, ఇతరులు ఇక్కడికొస్తే మాత్రం తప్పు. ఈ వైఖరి కూడా పార్టీ మునిగిపోయేందుకు కారణం. ఇక.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. గత ఎన్నికల్లో అటువైపే కన్నెత్తి చూడలేదు. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు అసలేమాత్రం సీన్ లేదని స్పష్టమవుతోంది.
కేసీఆరే వదిలేశారా..?
నిజానికి కేసీఆరే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయనతోపాటు, ఇతర నేతలెవరూ ఈ అంశాలపై మాట్లాడటం లేదు. సరిగ్గా చెప్పాలంటే తెలంగాణలోనే బీఆర్ఎస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణలోనే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. అందువల్ల కేసీఆరే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్‌ జాతీయ పార్టీ కార్యకలాపాల్ని కేసీఆర్ ఆపేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా.. ఎన్నో అంచనాలతో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపకుండానే.. ప్రాంతీయ పార్టీగా పరిమితమయ్యే అవకాశం ఉంది. మరింతగా కష్టపడితే తప్ప పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు.