Etela Rajender: ఈటలను ఓడించేందుకు కేసీఆర్ నయా స్కెచ్.. పోలీసు అధికారిని రంగంలోకి దించనున్న బీఆర్ఎస్?
ఉప ఎన్నిక సందర్భంగా ఈటలను ఓడించేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. మంత్రులు వెళ్లి మరీ ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఓడించలేకపోయారు. ఈసారి ఎలాగైనా ఈటలను ఓడించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

Etela Rajender: బీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యలా మారారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతంలో బీఆర్ఎస్‌లోనే ఉన్న ఈటలను 2021లో ఆపార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి గెలిచి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్‌పై ఈటల అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సరికొత్త ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నిక సందర్భంగా ఈటలను ఓడించేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. మంత్రులు వెళ్లి మరీ ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఓడించలేకపోయారు. ఈసారి ఎలాగైనా ఈటలను ఓడించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈటలపై పోటీకి పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ సిద్ధం చేయాలనుకుంది. అందుకోసమే అదే నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. హుజురాబాద్‌లో జరిగిన ఒక సభలో కూడా పాడి కౌశిక్ రెడ్డి అక్కడ్నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అయితే, ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక సామాజికవర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి. తమను చంపేందుకు కౌశిక్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంటూ ఈటల ఆరోపించడం కూడా సంచలనంగా మారింది. వివాదాలు, అనుచిత వ్యాఖ్యలు, గొడవల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. ఈటలను ఎదిరించి గెలవగలిగే ధీటైన అభ్యర్థి కోసం కేసీఆర్ వెతుకులాట ప్రారంభించారు.
పోలీసు అధికారిపై దృష్టి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఈటలపై ఒక పోలీసు అధికారిని పోటీకి దించాలనుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న పింగళి ప్రతాప్ రెడ్డిని ఈటలపై పోటీకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రతాప్ రెడ్డి కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఈటలపైకి పోటీకి దింపితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దీనికో కారణం ఉంది. గతంలో ప్రతాప్ రెడ్డి హుజురాబాద్‌లో సీఐగా పని చేశారు. అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరై, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయనను స్థానికులు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రతాప్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని కేసీఆర్ ఆలోచన. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.