కవిత బెయిల్ ఆర్డర్‌లో కీలక అంశాలు ఆ పని చేస్తే మళ్లీ జైలుకే
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. 165 రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత కవితకు బెయిల్ మంజూరయ్యింది. బెయిల్ కోసం రౌజ్ ఎవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. 165 రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత కవితకు బెయిల్ మంజూరయ్యింది. బెయిల్ కోసం రౌజ్ ఎవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఎక్కడా కవితకు ఊరట లభించలేదు. కవిత పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించిన తరువాత కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీ తన లీగల్ టీంతో కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పలు వాయిదాల తరువాత ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథ్‌ల బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై కవిత లాయర్ ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫు లాయర్ అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ సూర్యప్రకాష్ రాజ్ వాదనలు వినిపించారు. కవిత దాదాపు 5 నెలల నుంచి జైలులోనే ఉందని.. ఇప్పటికే వందల మంది సాక్షులను ప్రశ్నించినా కేసులో ఎలాంటి పురోగతి లేదని రోహత్గీ వాదించారు. కవిత బయటికి వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ ఈడీ తరుఫు లాయర్ రాజు వాదించారు.
కానీ కవిత ఓ రాజకీయ నేత అని.. ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదనే ముకుల్ రోహత్గీ వాదనతో సుప్రీం కోర్టు అంగీకరించింది. కేవలం పొలిటికల్ బ్యాగ్రౌండ్ కారణంగా బెయిల్ ఇవ్వకుండా ఉండలేమని.. పెద్ద కారణం ఉండే తప్ప బెయిల్ పిటిషన్ కొట్టేయలేమని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో కవితకు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగించడం కస్టమనీ చెప్తూ ఢిల్లీ హైకోర్ట్ ఆర్డర్‌ను కొట్టివేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కవిత పది లక్షలు చెల్లించాలి. తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్ట్ జడ్జికి అప్పగించాలి. కేసు విచారణ పూర్తయ్యేవరకూ దేశం విడిచి వెళ్ల కూడదు.
ఒక వేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అధికారుల అనుమతి తీసుకోవాలి. కేసు ఆధారాలు ధ్వంసం చేసే పని చేయకూడదు. విచారణ ఉన్న ప్రతీసారి అధికారులకు సహకరించాలి. విచారణలో అధికారులకు ఆటంకం కలిగించకూడదు. ఈ షరతులకు లోబడి కవిత ఉండాలని చెప్తూ బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కవితను తిహార్ జైలు నుంచి విడుదల చేయనున్నారు. కవితతో పాటు హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కవితను హైదరాబాద్‌కు తీసకురానున్నారు. కవిత బెయిల్‌తో బీఆర్ఎస్‌లో సంబరాలు మొదలయ్యాయి.