Top story: యోగి అడ్డాలో ఖలిస్తానీ టెర్రర్.. ఆ ముగ్గురి వెనుక ISI ఉందా?

దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్‌. రౌడీ మూకలు, గ్యాంగ్‌‌స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్‌లో రీసౌండ్ ఇస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2024 | 10:13 PMLast Updated on: Dec 24, 2024 | 10:13 PM

Khalistani Terror Attack In Yogi Adda Is Isi Behind Those Three

దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్‌. రౌడీ మూకలు, గ్యాంగ్‌‌స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్‌లో రీసౌండ్ ఇస్తుంది. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ యోగి ఆదిత్యనాథ్. క్రిమినల్స్‌కు అతనో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్‌స్టర్ల పాలిట యముడు. సీఎంగా యోగి చేసిందే చట్టం.. చెప్పిందే న్యాయం. అందుకే నేరం చేసిన ఏ క్రిమినల్ ఉత్తర ప్రదేశ్‌లో ఉండాలనుకోడు. యోగి కంటపడకుండా ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలనుకుంటాడు. కానీ, ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రం యూపీనే సేఫ్‌గా భావించారు. పంజాబ్‌లో మూడు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి యూపీలో తలదాచుకున్నారు. చివరకు యోగి పోలీస్ మార్క్ ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యారు. అయితే, ఆ ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి యూపీకే ఎందుకు వెళ్లారు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ సంచలన నిజాలేంటి? ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులకూ పాకిస్తాన్ గూఢచార సంస్థకూ ఉన్న లింకులేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

డిసెంబర్ 17న అమృత్‌సర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. 20వ తేదీన గురుదాస్‌పూర్ బంగర్, అదే రోజు బక్షీవాల్ పోలీస్ స్టేషన్ల వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ మూడు ఘటనల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే, ఈ దాడులకు బాధ్యతవహిస్తూ ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది పంజాబ్ పోలీసులు యాక్షన్‌లోకి దిగిపోయారు. ఉగ్రవాదులు పంజాబ్ నుంచి యూపీలోని ఫిలిబిత్‌కు వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ మొదలైంది అసలు సిసలు ఆపరేషన్. ఫిలిబిత్‌లో ఉగ్రవాదులు దాక్కొన్న లొకేషన్‌ ట్రేస్ చేసిన పోలీసులు.. ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నారు. మొదట సైలెంట్‌గా అరెస్ట్ చేసి తమ వెంట తీసుకెళ్లాలనే భావించారు. కానీ ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో సీన్ మారిపోయింది. చివరకు పోలీసుల కాల్పుల్లో వీరేంద్ర సింగ్, గుర్వీందర్ సింగ్, జసన్‌ప్రీత్ సింగ్‌‌ల కథ ముగిసిపోయింది. యూపీ పోలీసులకు స్థానికులు మద్దతు ఇవ్వడంతో పని ఈజీగా ముగిసిపోయింది. కానీ, ఈ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది ఆ ముగ్గురు ఉగ్రవాదుల కథ మాత్రమే. ఎందుకంటే ఈ ముగ్గురి వెనుకా చాలా పెద్ద నెట్‌వర్కే ఉంది.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల దగ్గర నుంచి ఏకే సరీస్ రైఫిల్స్ రెండు, గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అసలు నిజం ఏంటంటే.. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI మద్దతుతోనే ఈ గ్రూప్ రెచ్చిపోతోంది. అంటే భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా మరోసారి ఖలిస్తానీ వాదం నిలవబోతున్నట్టే లెక్క. నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నెత్తుటేర్లు పారించిన ఖలిస్తానీ భూతం మళ్లీ జడలు విప్పుతోంది అనడానికి యోగీ అడ్డాలో జరిగిన ఈ ఎన్‌కౌంటరే ఉదాహరణ. నిజానికి.. విదేశాల నుంచి ఖలిస్తానీ వాదాన్ని అరాచక శక్తులు చాలా బలంగా నడిపిస్తున్నాయి. వాటి వెనుక సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్నూ హస్తం ఉంది. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఖలిస్తానీలను ముందుండి నడిపిస్తున్నాడు పన్నూ. 2007లో సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌‌ను ప్రారంభించి.. మానవ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంస్థగా చెప్పాడు. చివరికి పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయటం తమ ఉద్దేశంగా అసలు కుట్ర బయటపెట్టాడు. అంతేకాదు, ఖలిస్తాన్‌ జెండా చేతపట్టే వారికి ఐ-ఫోన్లు, ఇతర ఖరీదైన గిఫ్ట్స్‌ను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తుంటాడు. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI గురుపత్వంత్ సింగ్ పన్నూను వెనుకుండి నడిపిస్తోంది. ఇప్పుడు యూపీలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వెనుక ISI హస్తం ఉందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

నిజానికి.. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని పునరుజ్జీవం పోసేందుకు పాకిస్తాన్ చాలా కాలంగా నీచమైన ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం పంజాబ్ నుంచి పారిపోయి పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన ఉగ్రవాది బబ్బర్ ఖల్సా చీఫ్ వాధ్వా సింగ్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా, భారతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ చీఫ్ భాయ్ లఖ్బీర్ సింగ్ రోడే, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్ పంజ్వాడ్‌లను పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఉపయోగించుకుంటుంది. పంజాబ్‌‌కు పాకిస్తాన్‌‌కు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పుడు అదే అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ సరిహద్దుల నుంచే డ్రోన్ల ద్వారా ఖలిస్తానీ శక్తులకు ISI ఆయుధాలు అందిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా లేకపోతే పంజాబ్‌ అల్లకల్లోలం కావటానికి పెద్ద సమయం పట్టదనే చెప్పాలి. సమాచార మాధ్యమాలు అంతగా లేని రోజుల్లోనే వేలాదిమందిని పొట్టనపెట్టుకుని దేశాన్ని ఆందోళనలో పడేసింది ఖలిస్తాన్‌ ఉద్యమం. ప్రస్తుత వాట్సాప్‌ కాలంలో అది తిరిగి ప్రారంభ‌మైతే.. జరిగే నష్టం ఊహకు కూడా అందదు.

దేశంలో ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించాలంటే వాటి మూలాలపై దృష్టి పెట్టక తప్పదు. కానీ, ఆ మూలాలన్నీ విదేశాల్లోనే ఉండటం భారత్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. కెనడా ఐతే బహిరంగంగానే ఖలిస్తానీ వాదులకు మద్దతు ఇస్తోంది. అమెరికా కూడా ఇందుకు అతీతం ఏం కాదు. గురుపత్వంత్ సింగ్ పన్నూ తమ దేశ భూభాగం నుంచే భారత్‌పై బెదిరింపు లకు దిగుతున్నా బైడెన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు కాస్త భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ అసలు సమస్యంతా పాక్ నుంచే. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ అండగా నిలిచినంతకాలం ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ వేదికలపై ఖలిస్తానీ కుట్రలను తీవ్రస్థాయిలో ఎండగట్టి పాక్ ప్రభుత్వానికి ఎలాంటి సాయం అందకుండా చూడగలిగితే దారికొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ద్వారా ఇటు ఖలిస్తానీ శక్తులకు, వాటికి మద్దతిస్తున్న పాకిస్తాన్‌కూ గట్టి సందేశం అయితే పంపించగలిగారు. ఈ కేసు విచారణలో కీలక అంశాలను బయటకు లాగితే పాకిస్తాన్‌ కుట్రలను బయటపెట్టడం అంత కష్టమేం కాదు. మరి ఆ దిశగా విజయం సాధిస్తారేమో చూడాలి.