Khammam Lok Sabha : ఖమ్మం సీటు చాలా హాట్ గురూ !
ఖమ్మం లోక్‌సభ సీటు ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్‌లో చేరబోతోంది. హేమా హేమీల కన్ను ఇప్పుడీ సీటుపై పడింది. వీళ్ళకే ఛాన్స్ అంటూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బంధువుల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అదే సమయంలో ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పుడీ సీటుకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.

Khammam Lok Sabha seat is now going to join the celebrity list. Hema Hemi's eyes fell on the seat.
ఖమ్మం లోక్‌సభ సీటు ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్‌లో చేరబోతోంది. హేమా హేమీల కన్ను ఇప్పుడీ సీటుపై పడింది. వీళ్ళకే ఛాన్స్ అంటూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బంధువుల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అదే సమయంలో ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పుడీ సీటుకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్, సిపిఐ కూటమి గెలిచింది. బీఆర్‌ఎస్ తరపున ఒకే ఒక్కడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు సీటుపై కాంగ్రెస్ పార్టీకి ఆశలు పెరిగాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలంతో ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే.. తేలిగ్గా గెలుస్తామన్న నమ్మకం పెరిగిందట ఖమ్మం కాంగ్రెస్ నేతల్లో.. అందుకే సీటుపై పోటీ పెరిగిందంటున్నారు. పార్టీ ప్రముఖులు తమ వారి కోసం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు తుమ్మల యుగంధర్ సీటు పోటీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి యుగంధర్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడో చేయాల్సిందనీ.. ఇప్పటికే లేటైనందున ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిసింది.
మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డికే సీటు అంటూ మరో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రసాద రెడ్డికే సీటు కన్ఫామ్ అయినట్టుగా ప్రచారం చేస్తోందట ఆయన అనుచరగణం. ఇదే సీటుపై ఇప్పటికే మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆశలు పెట్టుకున్నారు. ఆమె అంతకు ముందు ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ తానే పోటీ చేస్తానని అనుచరులకు చెబుతున్నారట రేణుక. కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడా ఖమ్మం సీటును ఆశిస్తున్నారట. షో రూంల అధినేతగా ఉన్న వివిసి.. ఇన్ చార్జి మంత్రి కోమటిరెడ్డి అండదండలతో తనకే సీటు వస్తుందని చెప్పుకుంటున్నారట. వీళ్ళలో ఎవరికి టిక్కెట్ వస్తుందోగానీ..ఇలా రకరకాలుగా జరుగుతున్న ప్రచారంతో.. పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోతోంది. అదంతా ఒక ఎత్తయితే.. అసలు వీటన్నిటినీ కాదని ఏకంగా సోనియాగాంధీ ఖమ్మం బరిలో ఉంటారన్నది లేటెస్ట్ టాక్. ఈ మేరకు ఏఐసీసీ నుంచి సమాచార మార్పిడి కూడా జరుగుతున్నట్టు చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం లోక్‌సభ టిక్కెట్.. మంత్రుల బంధువుల్లో ఒకరికి దక్కుతుందా? లేక వీళ్ళెవరూ కాకుండా నేరుగా సోనియానే సీన్‌లోకి వస్తారా అన్న ఉత్కంఠ పెరుగుతోంది.