Kolli Raghu Ram Reddy: జగన్ కళ్లలో ఆనందం కోసమేనా.. చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి జగన్ మనిషా ?
చంద్రబాబును అరెస్ట్ చేసిన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ మనిషి అంటూ టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా 2014లో తన ఓటమికి రఘురామిరెడ్డి కారణమంటూ అప్పట్లో ఆరోపించారు.
Kolli Raghu Ram Reddy: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో 48 గంటలుగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. బాబును అరెస్ట్ చేసిన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ మనిషి అంటూ టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రఘురామిరెడ్డి.. 2013-14 పీరియడ్‌లో కర్నూల్ ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలను ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
రఘురామరెడ్డి వైసీపీకి మద్దతుగా పని చేయాలి అనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలంటూ గతంలో స్వయంగా చంద్రబాబు.. రఘురామిరెడ్డి మీద సీరియస్ అయ్యారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా 2014లో తన ఓటమికి రఘురామిరెడ్డి కారణమంటూ అప్పట్లో ఆరోపించారు. అయితే అదే సంవత్సరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రఘురామిరెడ్డికి వెస్ట్ గోదావరి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించడంతో ఆరు నెలల్లోనే గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. 2015 నుంచి 2017 వరకూ ఆ పోస్ట్‌లోనే కంటిన్యూ అయ్యారు రఘురామిరెడ్డి.
ఆ తరువాత డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీస్‌కు వెళ్లారు. హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషన్ పోలీస్ అకాడమీలో డిప్యుటీ డైరెక్టర్ పోస్ట్‌లో జాయిన్ అయ్యారు. 2019లో తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఏపీకి తిరిగివచ్చారు. వెంటనే ఇంటలిజెన్స్ ఎస్పీగా రఘురామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై నిఘా ఏర్పాటు చేసే కీలక బాధ్యతలను రఘురామిరెడ్డికి అప్పగించారు. ముందు నుంచి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే అన్ని కార్యక్రమాలు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయనేది టీడీపీ నేతల వాదన. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కూడా ఆయన చేతుల మీదుగానే జరగడంతో రఘురామిరెడ్డి పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.