Komatireddy: కోమటిరెడ్డి రూటే సెపరేట్..!
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి కల్లోలం రేపారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీని వాడుకుంటున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుస్తుందనే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూటే సెపరేట్. పార్టీ కంటే ఆయన వ్యక్తిగత విషయాలకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తుంటారు. నువ్వా నేనా అన్నట్టు జరిగిన మునుగోడు ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పోరాడాల్సిన సమయంలో ప్రత్యర్ధులకు మేలు కలిగేలా మాట్లాడినా… వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవదని చెప్పినా ఆయనకే చెల్లుతుంది. ఓ వైపు పార్టీ గెలుపు కోసం పై నుంచి కింది వరకు నేతలు, కార్యకర్తలు నానాతంటాలు పడుతుంటే… ఇంకోవైపు కోమటిరెడ్డి శల్యసారధ్యం వహిస్తున్నట్టు మాట్లాడటం కలకలం రేపుతోంది. ఢిల్లీలో సోనియా, రాహుల్ కు జేజేలు కొట్టడం.. రాష్ట్రంలో మాత్రం పార్టీకి డ్యామేజి కలిగుతుందా? లేదా? అనేది పట్టకుండా తన ఇష్టానికి వ్యవహరించడం.. కోమటిరెడ్డికి పరిపాటిగా మారింది.
తాను కాంగ్రెస్ వాదినని.. కాంగ్రెస్సే తన పార్టీ అంటారు.. కానీ పార్టీ కష్టాల్లో ఉంటే మాత్రం తన తమ్ముడే తనకు ముఖ్యం అంటారు. కోమటిరెడ్డి ఇలా వ్యవహరించడంలో హైకమాండ్ పాత్రా ఉందంటున్నారు ఆయన ప్రత్యర్ధులు. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేసినప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే… మరోసారి ఆయన అలా మాట్లాడటానికి వీలు ఉండేది కాదనే వాదన పార్టీలో ఉంది. కోమటిరెడ్డి చర్యలను తీవ్రంగా పరిగణించి ఉంటే… ఆయన ఇప్పుడు ఇలా లైన్ క్రాస్ చేసే వారే కాదంటున్నారు. పార్టీకి విధేయత కంటే కోమటిరెడ్డి తన సొంత ఇమేజ్ పెంచుకోడానికే ఎక్కువ ప్రయార్టీ ఇస్తుంటారు. దాన్ని హైకమాండ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. పార్టీ ఉంటుంది… పార్టీకి ఎంపిక చేసిన నాయకత్వం ఉంటుంది.. పార్టీ నిర్ణయించుకున్న లైన్ కూడా ఉంటుంది. కానీ కోమటిరెడ్డికి ఇవేమీ పట్టవు. ఏది అనుకుంటే అది మాట్లాడటమే.
బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని సాక్షాత్తు రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పినప్పుడు పక్కనే ఉన్నారు కోమటిరెడ్డి. కానీ ఆయనే ఇప్పుడు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుస్తుందని స్టేట్మెంట్ ఇస్తారు. సీనియార్టీ దృష్ట్యా ఆయన్ను విమర్శించడానికి పార్టీలో ఎవరూ సాహసించడం లేదు. మునుగోడు ఎన్నికలకు ముందు జరిగిన సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. దానికి కోమటిరెడ్డి హర్ట్ అయ్యారని.. పార్టీలోని సీనియర్లే దయాకర్ తో క్షమాపణలు చెప్పించారు. కానీ… అదే కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడినప్పుడు అదే సీనియర్లు అదే కోమటిరెడ్డితో ఏదీ చెప్పించలేకపోతున్నారనే విమర్శ ఉంది. రేవంత్.. రేవంత్ వ్యతిరేకవర్గంగా విడిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ వ్యతిరేకవర్గంలో ఉన్న కోమటిరెడ్డి ఏది అన్నా… ఆయనకు ఆ వర్గం నుంచి మద్దతు వస్తోంది. దీనితో కోమటిరెడ్డి చెలరేగిపోతున్నారనే విమర్శలున్నాయి.