Shyamala Devi: ప్రభాస్ ఫ్యామిలీపై వైసీపీ కన్ను.. కృష్ణంరాజు సతీమణికి ఎంపీ టిక్కెట్.. రఘురామకు చెక్ పెట్టేందుకేనా..?

నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి శ్యామలాదేవిని పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. ఇదే స్థానం నుంచి ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే ఉద్దేశంతో శ్యామలాదేవిని రంగంలోకి దింపాలని ఆశిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2023 | 02:59 PMLast Updated on: Jun 20, 2023 | 2:59 PM

Krishnam Rajus Wife Shyamala Devi Will Join In Ysrcp Take On Raghu Rama Krishna Raju In Narsapuram

Shyamala Devi: దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రాబోతున్నారా..? ఈ మేరకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించిందా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. శ్యామలాదేవిని వైసీపీలోకి తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి శ్యామలాదేవిని పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. ఇదే స్థానం నుంచి ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే ఉద్దేశంతో శ్యామలాదేవిని రంగంలోకి దింపాలని ఆశిస్తోంది. ఈ అంశంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల శ్యామలాదేవితో చర్చలు జరిపారు. తమ పార్టీ తరఫున వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తామని, గెలుపు బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రతిపాదనను శ్యామలాదేవి తిరస్కరించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
రఘురామకు చెక్.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో ప్లస్
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ భావించడం వెనుక పెద్ద ప్లానే దాగుంది. ఇప్పటికే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ, తర్వాత ఆయనకు, పార్టీ అధినేత జగన్‌కు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీంతో రఘురామ వైసీపీని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇది జగన్‌కు మరింత ఇబ్బందిగా మారడంతో చివరకు రఘురామపై కేసులు కూడా పెట్టించి, అరెస్టు చేయించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ పెద్దలు భావించారు. దీనికోసం అనేక సమీకరణాల తర్వాత శ్యామలాదేవిని రాజకీయాల్లోకి తీసుకురావడమే సరైందని నిర్ణయించుకున్నారు. ఆమె ద్వారా రఘురామకు ఈజీగా చెక్ పెట్టొచ్చన్నది వైసీపీ ఆలోచన. దీనికి అనేక కారణాలున్నాయి. రఘురామ, శ్యామలాదేవి.. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. నర్సాపురం నియోజకవర్గంలో వీరి బలం ఎక్కువ. అందుకే రఘురామపై పోటీగా శ్యామలాదేవి అయితే బాగుంటుందనుకుంది వైసీపీ. తన ప్రణాళికకు అనుగుణంగా గతంలో కృష్ణంరాజు మెమోరియల్ పార్కుకు ఐదెకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం.

దీనిద్వారా క్షత్రియ రాజు సామాజికవర్గాన్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. అలాగే అటు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ఇది వైసీపీకి లాభాన్ని కలిగిస్తే.. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్‌కు నష్టం కలిగిస్తుంది. ఆ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్, ఆయన సామాజిక వర్గపు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే.. శ్యామలాదేవిని పార్టీలోకి తేవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. గతంలో కృష్ణంరాజు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఇప్పటికైతే.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె చెప్పారు. భవిష్యత్తులో ఆమె నిర్ణయం మారుతుందా.. లేదా చూడాలి.