KTR: చంద్రబాబుపై కేటీఆర్ మాటలు అసలుకే ఎసరు తెస్తాయా? వచ్చే ఎన్నికల్లో ఓట్లు పెంచుకోవడానికి ఎత్తుగడ వేశాడా?
తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ విభేదాలు, విద్వేషాలు ఫార్ములా పైనే పనిచేసే కేసీఆర్ కుటుంబం ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ఏదో ఒక ప్రాంతీయ విభేదాన్ని ప్రయోగిస్తూనే ఉంటుంది.
KTR: వీలున్నప్పుడల్లా మాటల్లో తన అహంకారాన్ని బయట పెట్టుకోవడం.. దానికి తెలంగాణ ఆత్మగౌరవం అని టైటిల్ తగిలించడం.. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కి అలవాటు అయిన పని. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ విభేదాలు, విద్వేషాలు ఫార్ములా పైనే పనిచేసే కేసీఆర్ కుటుంబం ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ఏదో ఒక ప్రాంతీయ విభేదాన్ని ప్రయోగిస్తూనే ఉంటుంది.
చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాదులో ఐటి ప్రొఫెషనల్స్ సైబర్ సిటీలో ఆందోళన చేశారు.
తగుదునమ్మా అని దీని మీద రియాక్ట్ ఆయన కేటీఆర్..‘‘పక్క రాష్ట్రం సమస్యలతో మాకేం పని.. మీరు ఆందోళనలు చేయాలనుకుంటే రాజమండ్రి వెళ్లి అక్కడ భూమి బద్దలయ్యేటట్టు చేయండి. ఇక్కడ మాత్రం ఇలాంటివి అనుమతించం. లా అండ్ ఆర్డర్ సమస్య కి సంబంధించి పక్క రాష్ట్రం ఆందోళనలకు హైదరాబాదులో పర్మిషన్ ఇవ్వం. లోకేష్ నాకు ఫోన్ చేసి అడిగితే కూడా ఇదే చెప్పాను’’ అని ఎక్కడలేని అహంకారాన్ని, అసహనాన్ని వెళ్లగక్కుతూ దర్పాన్ని ప్రదర్శించాడు. దీనిపై ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతుంది. 2018లో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడాన్ని చూపించి అప్పుడు గట్టెక్కిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ అలాంటి ఫార్ములానే వెతుక్కుంటుంది. దాన్లో ఇది భాగం అయి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. తెలంగాణలో సీమాంధ్రులను కేటీఆర్ మాటలు మరోసారి అభద్రతలో పడేశాయి. ఎక్కడో హైటెక్ సిటీ దగ్గర ఒక వందమంది ఆందోళన చేస్తే దానికి శాంతిభద్రతల సమస్యని భూతంగా చూపించడం అహంకారం కాకపోతే ఇంకేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్.. బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ప్రచారం చేసుకోవచ్చు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదంలో వేలు పెట్టొచ్చు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఓపెన్ చేసుకోవచ్చు. జనం సొమ్ముతో ముఖ్యమంత్రి భారీ కాన్వాయ్ వేసుకొని మహారాష్ట్రలో సభలు పెట్టుకోవచ్చు. కానీ హైదరాబాదులో ఓ 100 మంది చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేయకూడదు.
తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం అమెరికా, యూరప్‌లో చిన్న చిన్న ఆందోళనలు జరగలేదా..? సభలు సదస్సులు నిర్వహించలేదా? అక్కడి నుంచి కోట్ల రూపాయలు ఎన్నారై నిధులు ఉద్యమానికి తెచ్చుకోలేదా? తెలంగాణ కోసం ఢిల్లీలో ఉద్యమాలు చేయలేదా? అప్పుడు లేని ప్రాంతీయ బేధం ఇప్పుడు కేటీఆర్‌కు ఎందుకు వచ్చింది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల ముఖ్యమంత్రి.. తెలంగాణలో సుమారు కోటి మంది సీమాంధ్రులు ఉన్నారు. కచ్చితంగా ఆంధ్రాలో జరిగే ఏ విషయం పైనైనా సరే స్పందిస్తారు. ఆ మాత్రం దానికి అదేదో మొత్తం తెలంగాణకి.. ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జనానికి తానే ప్రతినిధి అయిపోయినట్లుగా కేటీఆర్ ఓవరాక్షన్ చేయడం ఏంటని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఏదో ఒక వివాదాన్ని రేపి ఓట్లు దండుకోవడానికి కేసీఆర్ వేసే పాత టెక్నిక్‌ని కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రయోగించారని ఇంకొందరు అంటున్నారు.
పక్క రాష్ట్రం రాజకీయాలపై కేటీఆర్ ఇష్టముంటే స్పందించాలి. లేదంటే మౌనంగా ఉండాలి. శాంతియుతంగా జరిగే ఆందోళనలపై చిల్లర కామెంట్లు చేయడం ఏంటని విరుచుకుపడుతున్నారు తెలంగాణలో సీమాంధ్రులు. నిజానికి చంద్రబాబు అరెస్టు కాగానే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కమ్మ నాయకులంతా ఆవేశంగా రియాక్ట్ అయ్యారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో పాటు చాలామంది చంద్రబాబు అరెస్టుని ఖండించారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మరికొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా పెద్ద ర్యాలీ తీశారు. ఆ నియోజకవర్గాల్లో ఉండే సీమాంధ్ర ఓట్ల కోసం. ముఖ్యంగా.. కమ్మ వాళ్ళ ఓట్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టుపై నిరసన ప్రదర్శనలు చేశారు. అక్కడ లేని శాంతి శాంతిభద్రతల సమస్య సైబర్ సిటీలో ఎందుకు వచ్చిందో కేటీఆర్‌కే తెలియాలి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని కేటీఆర్ అనుకుంటే జనం కూడా ఓ నవ్వు నవ్వుకొని వెళ్లిపోవడం మంచిది.