KTR: కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన కేటీఆర్.. ఆ వర్గం అంతా అటువైపేనా..?

చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలంగాణలోనూ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు మద్దతుదారులు, ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు హైదరాబాద్‌సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. వీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 4, 2023 | 06:00 PMLast Updated on: Oct 04, 2023 | 6:00 PM

Ktr Helps Congress Through His Comments On Chandrababu Naidu

KTR: రాజకీయాల్లో ప్రతి మాటకూ ఒక లెక్కుంటుంది. అందుకే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే లెక్క తప్పుతుంది. ఎప్పుడూ జాగ్రత్తగా మాట్లాడే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మాట.. ఈసారి లెక్కతప్పింది. ఏపీలో చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు బీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగేలా చేశాయి. చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రజలు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. తర్వాత విషయం గ్రహించి బీఆర్ఎస్ సర్దుబాటు చర్యలకు దిగినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ విషయంలో కొంత సానుకూలంగా ఉన్న తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం ప్రజలు ఈసారి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే పరిస్థితి వచ్చింది.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలంగాణలోనూ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు మద్దతుదారులు, ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు హైదరాబాద్‌సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. వీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలతో, చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకేం సంబంధం అన్నారు. అంతగా నిరసనలు చేయాలనుకుంటే ఏపీలోని రాజమండ్రికి వెళ్లి భూమి దద్దరిల్లేలా ఆందోళనలు చేసుకోవాలన్నారు. ఈ అంశంపై ఇక్కడ ఆందోళనలు చేస్తామంటే మద్దతిచ్చేది లేదన్నారు. అంతే.. ఈ మాటలతో తెలంగాణలోని చంద్రబాబు మద్దతుదారులు, సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబు అరెస్టును వాళ్లంతా వ్యతిరేకిస్తుంటే.. కేటీఆర్ మాత్రం కనీసం ఆందోళనలు చేయనివ్వకుండా అడ్డుకోవడంతో వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. సీమాంధ్రుల నుంచి సోషల్ మీడియా వేదికగా నిరసన వక్తమైంది. కేటీఆర్‌కు అంత అహంకారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వాళ్లందరూ ఇప్పుడు బీఆర్ఎస్‌క వ్యతిరేకంగా మారారు.
మాట మార్చిన కేటీఆర్
కేటీఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత కనిపించడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యల ప్రారంభించింది. తర్వాత కేటీఆర్ కూడా చంద్రబాబు గురించి సానుకూలంగానే మాట్లాడారు. కేటీఆర్.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. హరీష్ రావు సహా ఇతర నేతలంతా చంద్రబాబు అరెస్టుస సరికాదన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో చంద్రబాబును ఇలా అరెస్టు చేసి, ఇబ్బంది పెట్టడం సరికాదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై సానుభూతి చూపిస్తున్నారు. అయితే, ఇదంతా సీమాంధ్రుల ఓట్ల కోసమే అన్నది అందరికీ తెలిసిందే. అయితే, మొదట చంద్రబాబు విషయంలో విమర్శలు చేసి, ఆ వెంటనే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు మాట మార్చడంపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కేటీఆర్ అవకాశవాద రాజకీయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కాంగ్రెస్‌కు మేలు చేసిన కామెంట్స్
కేటీఆర్ తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి మేలు చేశారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ విషయంలో ఇప్పటిదాకా సానుకూలంగా లేదా తటస్థంగా ఉన్న సీమాంధ్రులు కేటీఆర్ వ్యాఖ్యలతో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచుకున్నారు. దీంతో వీళ్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. తమ నాయకుడిని అవమానించిన కేటీఆర్‌కు గుణపాఠం నేర్పాలనే అభిప్రాయం ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే.. అర్జెంటుగా సీమాంధ్రులు.. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బీఆర్ఎస్ పడిపోయింది.