KTR: అలా అనడం తప్పే..! చంద్రబాబు అరెస్టు తర్వాతి వ్యాఖ్యలపై కేటీఆర్..

ఏపీ రాజకీయాలు ఏపీలో చూసుకోవాలనీ, రాజమండ్రిలో భూమి బద్దలయ్యేంత ర్యాలీ చేసుకోండని సెటైర్లు వేశారు. అటు పోలీసులు కూడా ఐటీ ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించడంతో వివాదం మరింత ముదిరింది. కేటీఆర్ పెట్టిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 04:54 PMLast Updated on: Nov 14, 2023 | 4:54 PM

Ktr Realised About Comments On Chandrababu Naidu Supporting Rallys

KTR: మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తన తప్పు తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చేసిన కామెంట్స్.. తమ పార్టీపై ఇంత ప్రభావం చూపిస్తాయని ఊహించలేదు. ఇప్పుడు తప్పు తెలుసుకున్న కేటీఆర్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. అయ్యో.. అలా అనకుండా ఉండాల్సింది అంటూ టీవీ ఇంటర్వ్యూల్లో బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి

ఇటు తెలంగాణలోనూ సీమాంధ్రులు, ఐటీ ఉద్యోగులు ర్యాలీలు చేపట్టారు. తెలంగాణలోని ఈ ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరే వివాదస్పదమైంది. హైదరాబాద్‌లో నిరసనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీ రాజకీయాలు ఏపీలో చూసుకోవాలనీ, రాజమండ్రిలో భూమి బద్దలయ్యేంత ర్యాలీ చేసుకోండని సెటైర్లు వేశారు. అటు పోలీసులు కూడా ఐటీ ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించడంతో వివాదం మరింత ముదిరింది. కేటీఆర్ పెట్టిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి ఓటు వేయవద్దని కోరుతున్నారు. గత రెండు దశల్లో కూడా తెలంగాణలోని సీమాంధ్రులు బీఆర్ఎస్‌కే ఓట్లేశారు. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీట్లు ఎక్కువ గెలవడానికి కారణం కూడా సీమాంధ్రులే. అయితే వాళ్ళంతా చంద్రబాబు సానుభూతి పరులా అంటే.. కాకపోవచ్చు.

కానీ, అందులో కమ్మ కులస్థులు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంటారనడంలో సంందేహం లేదు. కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాతి ఆందోళనలపై ఏపీ వాళ్ళు ఇక్కడ ఆందోళన చేయొద్దనే అర్థం వచ్చేలా కేటీఆర్ మాట్లాడటమే వివాదస్పదమైంది. ఆ స్టేట్‌మెంట్ తర్వాత బీఆర్ఎస్‌కు డ్యామేజీ జరిగిందని కేటీఆర్‌కు అర్థమైంది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. టీవీ ఇంటర్వ్యూల్లో అప్పటి పరిణామాలకు వివరణ ఇచ్చుకుంటున్నారు కేటీఆర్. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు చేయొద్దని తాను చెప్పలేదనీ.. శాంతిభద్రతల సమస్య గురించే మాట్లాడానన్నారు. దాన్నే తాను మరోలా చెబితే బాగుండేదని అంటున్నారు కేటీఆర్. చంద్రబాబు అరెస్టు తర్వాత.. ఏపీ నుంచి ఓ ముఖ్య వ్యక్తి తనకు కాల్ చేసి.. ఓటుకు నోటు కేసు బయటకు తీయమన్నాడు. కానీ, తాము అలా చేయలేదన్నారు. రామోజీరావు అరెస్టు కూడా చట్టపరంగానే జరగాలని తాము చెప్పామన్నారు.

Janasena: జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి.. జనసేన ఆరోపణ..

చంద్రబాబు అరెస్టు విషయంలో తమకు స్పష్టత ఉందనీ, ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపేనన్నారు కేటీఆర్. లోకేష్ తనకు మిత్రుడేననీ, మొన్నటికి మొన్న ప్రచారంలో వ్యాన్ నుంచి పడబోయినప్పుడు కూడా తన ఆరోగ్యం గురించి మెస్సేజ్ చేశారని కేటీఆర్ చెప్పారు. లోకేష్, పవన్, జగన్‌తో తమకు ఎలాంటి విరోధం లేదంటున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీతో తమకు ఎలాంటి గొడవల్లేవని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. సీమాంధ్రుల ఓట్లకు గండిపడకుండా ఆలస్యంగానైనా కేటీఆర్ మేల్కొన్నారు.