సైలెంట్ గా ఉండు బావా రేవంత్ ను కెలుకుతున్న హరీష్..
తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. నేడు హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. నేడు హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. దాదాపు 20 రోజుల నుంచి కేటీఆర్ అరెస్టు వ్యవహారంలో పెద్ద రచ్చే జరుగుతుంది. ముందు తనను అరెస్టు చేయాలని.. అరెస్టు చేస్తే తాను జైల్లో కూర్చుని యోగా చేసుకుంటానంటూ ధీమాగా చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు మాత్రం భయపడుతున్నారు. అరెస్టు సమయం దగ్గరకు వచ్చేసరికి కేటీఆర్ లో ఆ ధీమా కనబడటం లేదు.
పార్టీ నేతలు కూడా కేటీఆర్ అరెస్టు విషయంలో దైర్యంగా ఉన్నట్లు కనపడినా.. ఆ తర్వాత మాత్రం కాస్త జంకుతున్నారు. అరెస్టు వ్యవహారం నుంచి బయటపడేందుకు హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు కేటీఆర్. కానీ తాజాగా హైకోర్టు ఇచ్చిన షాక్ తో కేటీఆర్ లో భయం మొదలైంది. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఎంటర్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కేటీఆర్. ఇక తాజాగా హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా సరే ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు నీ వెంట పడతాం అంటూ హెచ్చరించారు. అక్రమ కేసులతో అరెస్టులతో మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తే అవన్నీ చెల్లే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేసుకుంటే చేసుకోవాలని.. తామేమి అరెస్టు గురించి ఆందోళన చెందడం లేదంటూ కాస్త ఆసక్తికర కామెంట్ చేశారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా విచారణకు వెళ్తామంటూ సవాల్ కూడా చేశారు. కేటీఆర్ కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారంటూ హరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
వాస్తవానికి కేసు నమోదైన తర్వాత కేటీఆర్ దూకుడుగానే మాట్లాడారు. కానీ ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థలు ఎంటర్ కావడంతో కేటీఆర్ కు విషయం అర్థమైంది. దీనితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినా సరే రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెద్దపెద్ద విమర్శలు ఏమి చేయకుండానే సైలెంట్ గా ఉండిపోయారు. అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా కేటీఆర్ పెద్దగా మాట్లాడటం లేదు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ముందు పెద్దది చేసే ప్రయత్నం చేసిన కేటీఆర్ ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టడంతో ఆ కేసు నుంచి ఎలా బయటకు రావాలి అనే దానిపై తర్జనభజన పడుతున్నారు.
ముందు ఏసీబీ కేసు అనుకుని తక్కువ అంచనా వేసిన కేటీఆర్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అయింది అనే క్లారిటీ రావడంతో విషయం అర్థమైంది. ఇక తాజాగా మరోసారి ఈనెల 16న కేటీఆర్ విచారణకు రావాలంటూ ఈడి నోటీసులు పంపింది. కేటీఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ గానే మారాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీల పై విచారణ జరగాల్సిందేనని కోర్టు అభిప్రాయబడింది.
కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారంటూ పేర్కొన్న కోర్టు చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని… ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఈ కేసు పై ఏసీబీ ఆధారాలు సేకరించాలని.. ఫార్ములా ఈ రేస్ కేసులో… తాము ఇప్పుడే జోక్యం చేసుకోమంటూ క్లారిటీ ఇచ్చింది కోర్ట్. ఈ రేస్ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేస్తుందా లేదంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేస్తుందా అనేది క్లారిటీ రావడం లేదు. సోమవారం కేటీఆర్ విచారణకు హాజరు కావలసి ఉన్నా.. ఆయన తప్పించుకున్నారు. దీనితో ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనితో ఆ రోజునే కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.