కేటిఆర్ ట్వీట్ దూల.. ఓ ఆట ఆడుకుంటున్న టీడీపీ

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన కాస్త నోరు జారుతూ ఉంటారని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 03:20 PMLast Updated on: Mar 10, 2025 | 3:20 PM

Ktrs Tweet Is A Joke Tdp Is Playing A Game

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన కాస్త నోరు జారుతూ ఉంటారని.. పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. అనవసరమైన విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుని.. ఏదో ఒక రూపంలో రాద్దాంతం చేస్తూ ఉంటారు. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. ఏపీలో చంద్రబాబు నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన.. ఒక షో చూస్తూ దాని గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

దానిపై ఇప్పటికి దుమారం రేగుతునే ఉంటుంది. గులాబీ పార్టీ ఓడిపోవడానికి కారణం అదే అనే అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. టిడిపి బలంగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది కేటీఆర్ ను వ్యతిరేకించడమే కాకుండా, ఆ ప్రభావం టిఆర్ఎస్ పై కూడా గట్టిగానే పడింది అనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. ఇక ఇటీవల కాలంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేటీఆర్ పేరు బయటకు రావడంతో సోషల్ మీడియాలో.. టిడిపి క్యాడర్ గట్టిగానే ఆయనను ఆడుకుంటుంది.

తాజాగా కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. “ఆఖరికి ఆంధ్రప్రదేశ్” అంటూ ఆయన మాట్లాడిన ఓ మాట దుమారం రేపుతోంది. తెలంగాణకు రావాల్సిన 1700 కోట్ల సోలార్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపుతోంది. మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు.. తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ను కూడా ఎంచుకుంటున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు.

కేటీఆర్ “ఆఖరుకు” అనే పదం ఎందుకు వాడారు అని.. ఏపీ పెట్టుబడులకు పనికిరాదా.. అంత అహంకారం ఎందుకని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు, అలాగే న్యూట్రల్ గా ఉండే కొంతమంది నెటిజన్లు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెట్టుబడులు పెద్దగా రాలేదు. అదే సమయంలో తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉండటంతో.. అక్కడ పెట్టుబడులు భారీగానే వచ్చాయి. ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కారణంగా పెట్టుబడులు రావడం లేదని ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి.

ఏపీకి పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ప్రముఖ కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అప్పట్లో ఆసక్తి చూపించాయి. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చెందిన అమర్ రాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది. ఇక అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ ను కేటీఆర్ పలుమార్లు తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఆఖరుకు ఆంధ్రప్రదేశ్ అంటూ మాట్లాడడాన్ని టిడిపి క్యాడర్ సీరియస్ గా తీసుకుంది. అధికారం కోల్పోయిన సరే కేటీఆర్ లో అధికార అహం తగ్గలేదని.. ఆయన ఇలాగే కొనసాగితే గులాబీ పార్టీ మరింత దిగజారి పోతుందని, రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం మీద కేటీఆర్ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.