Mohammed Faizal: లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన లక్షద్వీప్ ఎంపీ ఫైజల్..
ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోకసభ సెక్రటేరియట్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 2009 ఎన్నికల సందర్భంగా ఒక కాంగ్రెస్ నాయకుడిపై కత్తితో దాడి చేశారంటూ ఫైజల్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదయింది.
Mohammed Faizal: ఎన్సీపీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై లోక్‌సభ అనర్హత వేటువేసింది. ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోకసభ సెక్రటేరియట్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 2009 ఎన్నికల సందర్భంగా ఒక కాంగ్రెస్ నాయకుడిపై కత్తితో దాడి చేశారంటూ ఫైజల్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదయింది. దీనిపై విచారణ జరిపిన కరవత్తి సెషన్స్ కోర్టు ఫైజల్‌కు గత జనవరిలో పదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడటంతో అప్పట్లోనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.
దీనిపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఫైజల్‌కు విధించిన శిక్షను కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ లక్షదీప్ అధికార యంత్రాంగం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు నిర్ణయం సరికాదంటూ ఆగస్టు 22న తీర్పు ఇచ్చింది. అయితే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని మాత్రం వెంటనే రద్దు చేయకుండా ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఫైజల్ హైకోర్టును ఆశ్రయించారు. తనను దోషిగా నిర్ధారిస్తూ విధించిన శిక్షను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై పునఃవిచారణ జరిపిన కోర్టు.. అతడి పిటిషన్‌ను అక్టోబర్ 3, మంగళవారం తిరస్కరించింది. హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చినట్లైంది.
హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ)లో పేర్కొన్నట్లు, ప్రజా ప్రాతినిద్యం చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, ఫైజల్‌కు శిక్ష విధించిన మరుక్షణమే లోకసభలో (చట్టసభలు) సభ్యత్వం కోల్పోయినట్లేనని లోకసభ సెక్రెటరీ పేర్కొన్నారు. దీంతో ఫైజల్ సభ్యత్వం రద్దైంది.