Left Parties: బీఆర్ఎస్‌కు దూరంకానున్న లెఫ్ట్ పార్టీలు.. కాంగ్రెస్‌వైపు కమ్యూనిస్టుల చూపు..?
కమ్యూనిస్టుల్ని దూరం పెట్టి, ఎంఐఎంతో కలిసి సాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు ఉండదు కానీ.. అవగాహనా ఒప్పందం మాత్రం ఉంటుంది.
Left Parties: ఇటీవలి కాలం వరకు బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవబోతున్నారు. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీల మద్దతుతోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం అంగీకరించారు.
దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీలు, బీఆర్ఎస్ కలిసి పని చేస్తాయని భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కమ్యూనిస్టులతో కలిసి నడిచేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. కమ్యూనిస్టులకు ఖమ్మం, నల్గొండ జిల్లాలో మంచి పట్టు ఉన్న మాట నిజమే. కానీ, క్రమంగా లెఫ్ట్ పార్టీల బలం గ్గూతూ వస్తోంది. మరవైపు ఇటీవల సీపీఐ, సీపీఎంలు కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. తమకు ప్రత్యర్థి పార్టీగా భావించే కాంగ్రెస్ కూటమిలో ఉన్న కారణంగా బీఆర్ఎస్ కమ్యూనిస్టులకు దూరంగా ఉండాలనుకుంటోంది. మరో కారణం.. ఎంఐఎం. జాతీయ రాజకీయాల్లో ఎంఐఎం, కమ్యూనిస్టులు బద్ధ శత్రువులు. రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు. తెలంగాణలో బీఆర్ఎస్.. కమ్యూనిస్టులతో కలిస్తే, ఎంఐఎం దూరమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎంను దూరం చేసుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదు.
కమ్యూనిస్టులతో పోలిస్తే ఎంఐఎం పార్టీనే బలంగా ఉంది. ఎంఐఎం వల్ల ముస్లిం వర్గం ఓట్లు పడుతాయి. కమ్యూనిస్టుల ప్రభావం రెండు జిల్లాల్లోనే ఉంటే.. ఎంఐఎం ప్రభావం దాదాపు 25 నియోజకవర్గాల్లో ఉంది. అందువల్ల కమ్యూనిస్టులతో వెళ్లడం కన్నా ఎంఐఎంతో వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. పోనీ వారితో కలిసి పోదామన్నా.. సీట్ల పంపకాల్లో ఇబ్బంది ఉంది. తమకు చెరో ఐదు సీట్ల చొప్పున మొత్తం పది సీట్లు కావాలని కమ్యూనిస్టులు అడుగుతున్నారు. ఈ లెక్కన సీపీఐకి ఐదు సీట్లు, సీపీఎంకు ఐదు సీట్లు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి అన్ని సీట్లు ఇవ్వడం బీఆర్ఎస్‌కు సాధ్యం కాదు. ఒకవేళ సీట్లు ఇచ్చినా.. వాటిలో చాలా వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఇది బీఆర్ఎస్‌కు నష్టమే. ఎలా చూసినా.. కమ్యూనిస్టులతో పెద్దగా ప్రయోజనం లేదని కేసీఆర్ ఆలోచన. అందుకే కమ్యూనిస్టుల్ని దూరం పెట్టి, ఎంఐఎంతో కలిసి సాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు ఉండదు కానీ.. అవగాహనా ఒప్పందం మాత్రం ఉంటుంది. తాజా పరిస్థితుల మధ్య కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కేంద్రంలో ఆ పార్టీ ఉన్న ఇండియా కూటమిలో చేరిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పొత్తుపై త్వరలోనే స్పష్టత రానుంది.