Wrestlers Protest: రెజ్లర్లతో అమిత్ షా భేటీ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న హోం మంత్రి

ఇప్పటివరకు పెద్దగా స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా రెజ్లర్లతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రెజ్లర్ భజరంగ్ పునియా వెల్లడించారు. శనివారం రాత్రి మంత్రి అమిత్ షాను కలిసినట్లు పునియా తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2023 | 10:01 AMLast Updated on: Jun 05, 2023 | 10:01 AM

Let Law Take Its Course Amit Shah Told Wrestlers In Late Night Meet

Wrestlers Protest: రెజ్లర్ల నిరసనకు అన్నివైపుల నుంచి మద్దతు లభిస్తుండటంతో కేంద్రం కూడా నెమ్మదిగా స్పందిస్తోంది. ఇప్పటివరకు పెద్దగా స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా రెజ్లర్లతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రెజ్లర్ భజరంగ్ పునియా వెల్లడించారు.

శనివారం రాత్రి మంత్రి అమిత్ షాను కలిసినట్లు పునియా తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ కొంతకాలంగా రెజ్లర్లు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ వంటి క్రీడాకారులు ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనకు దిగారు. రెజ్లర్ల దీక్షకు తాజాగా ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, క్రీడాకారులు, వివిధ రంగాల ప్రముఖులు మద్దతు తెలిపారు.

దీంతో కేంద్రం కూడా ఈ విషయంలో స్పందిస్తోంది. తాజాగా అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో రెజర్లను కలిశారు. పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవార్థ్ కెడియాన్‌లతో సమావేశమయ్యారు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయంలో నిష్పాక్షక దర్యాప్తు జరిగేలా చూస్తానని అమిత్ షా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారికి హామీ ఇచ్చారు.

ఇప్పటికే బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఐదు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ గడువు ముగుస్తుండటంతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ నిరసన ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా సాగుతోంది. బ్రిజ్ భూషన్ సింగ్‌పై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.