మంగళగిరితో పాటు మరో ఆప్షన్.. లోకేశ్ పోటీ చేయబోయే స్థానం ఏంటి ?

ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. ఏపీలో రాజకీయం భగ్గుమంటోంది. జనాలకు చేరువయ్యేలా వైసీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తోంది టీడీపీ. పాదయాత్ర అంటూ లోకేశ్‌.. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు.. జనాలను కలుస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో యుద్ధం కాదు.. అంతకుమించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 21, 2023 | 02:04 PMLast Updated on: May 21, 2023 | 2:04 PM

Lokesh Contesing In Mangalagiri And Kalyanadurgam

చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా.. యువగళంతో బిజీగా ఉన్న లోకేశ్‌.. రాష్ట్రవ్యాప్తంగా తన ఇమేజ్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్న లోకేశ్‌.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై కూడా లోకేశ్‌.. కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్‌.. ఆళ్ల మీద ఓడిపోయారు.

తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా.. సీఎం కొడుకు, ఓ పార్టీకి వారసుడిని ఓడించిన విషయాన్ని వైసీపీ విపరీతంగా ప్రమోట్ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ముందు ఎమ్మెల్యేగా గెలువు.. వేరే సంగతి తర్వాత చూద్దాం అని ఇప్పటికీ సైటెర్లు వేస్తుంటారు వైసీపీ నేతలు.. లోకేశ్‌ మీద ! మంగళగిరిలో మరోసారి లోకేశ్‌ను ఓడించాలని వైసీపీ ప్లాన్‌ చేస్తోంది. మంగళగిరి మీద పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టింది. లోకేశ్‌ను ఓడించేందుకు రకరకాలుగా స్కెచ్‌లు వేస్తుండడంతో… పోటీ రసవత్తరంగా మారే చాన్స్ కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మంగళగిరితో పాటు మరో నియోజకవర్గంలో నుంచి పోటీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై.. లోకేశ్‌ ఆలోచనలో పడ్డారట. మంగళగిరిలో ఓడినా, కళ్యాణదుర్గంలో గెలుస్తాననే నమ్మకంతో లోకేష్ ఉన్నారట.

అందుకే రెండో ఆప్షన్‌ను రెడీ చేసి పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. అమరావతి మీద పట్టుసాధించేందుకు వైసీపీ సర్కార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 50వేల కుటుంబాలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు కేటాయించడం, దీనికి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. వారంతా వైసీపీకి అనుకూలంగా మారితే.. మంగళగిరిలో లోకేశ్‌కు ఇబ్బంది అయ్యే చాన్స్ ఉంది. అందుకో మంగళగిరితో పాటు మరో ఆప్షన్‌ కూడా చూసుకున్నారని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.