Telangana: తెలంగాణలో జోరుగా సర్వేలు.. ఏర్పడేది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి ప్రభుత్వమేనా?
శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లు.. ఏ పార్టీకి సరిగా సీట్లు రాకపోతే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నా.. అదేదే షెడ్యూల్ వచ్చేసింది అన్న రేంజ్‌లో తెలంగాణ రాజకీయం మండుతోంది. పాదయాత్రలు, పలకరింపులు, సభలు, సమావేశాలు, సమీక్షలు.. పేరు ఏదైనా.. ఇప్పుడు పార్టీలన్నీ జనాల్లో ఉంటున్నాయ్. జనంలానే కనిపిస్తున్నాయ్. బీజేపీ సూపర్ స్ట్రాంగ్‌గా మారుతుంటే.. కాంగ్రెస్ కూడా మళ్లీ రేసులోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ పార్టీకి అధికారం దక్కబోతుందన్న ప్రశ్న అంతుచిక్కకుండా ఉంది. పైగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోజుకో సర్వే.. పార్టీలను మరింత టెన్షన్ పెడుతోంది.
ఈ మధ్యే ప్రశాంత్ కిశోర్ సర్వే పేరుతో.. ఓ రిపోర్టు సోషల్ మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. దక్షిణ తెలంగాణలో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు అంటూ ఉన్న ఆ రిపోర్టు.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చకు కారణమైంది. దీంతో అసలేంటి పరిస్థితి పార్టీలన్నీ సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయ్. పార్టీల సర్వేలతో పాటు ప్రైవేటు సర్వేలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. ఏ సర్వే చూసినా.. అధికారం ఎవరిది అని పక్కాగా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్‌కు 45, కాంగ్రెస్‌కు 20, బీజేపీకి 25… నంబర్ అటు ఇటు అయినా.. మూడు పార్టీలు పంచుకునేది ఈ 90 స్థానాలే అని నివేదికలు చెప్తున్నాయ్. దీంతో ఆ 20 స్థానాలు కీలకంగా మారాయ్. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో టక్కున చెప్పలేని పరిస్థితి. ఈ సీట్లే.. తెలంగాణలో నెక్ట్స్ అధికారం ఎవరిది అని తేల్చే అవకాశం ఉంది. ఈ సర్వేలు నిజమై.. ఇదే నంబర్ ఫలితాల్లో కనిపిస్తే.. రాజకీయం కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో తగినన్ని సీట్లు రాకపోతే.. కాంగ్రెస్‌లో మరోసాలి చీలిక జరగడం ఖాయం అనే ప్రచారం ఇప్పుడే ఊపందుకుంది. 2018 ముందు ఫాలో అయిన స్ట్రాటజీనే.. అప్పుడూ కేసీఆర్ అనుసరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. చీలిక సాధ్యం కాదు అనుకుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు అని మరికొందరి ఒపీనియన్. రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు.. ఇప్పుడు బీజేపీనే ! శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లు.. ఏ పార్టీకి సరిగా సీట్లు రాకపోతే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.