Cooking Gas: ఎన్నికల్లో ముంచినా.. తేల్చినా.. “గ్యాసు”దే భారమట..!!
వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఇంటిని, ప్రతి ఇల్లాలిని ఆకట్టుకునేలా ఒక హామీ తెరపైకి వచ్చింది. అదే.. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ హామీ! కాంగ్రెస్‌లాంటి బడా నెట్‌వర్క్ కలిగిన పొలిటికల్ పార్టీ కూడా వంటగ్యాస్ సిలిండర్‌పై ఎంతో నమ్మకం పెట్టుకుంది.
Cooking Gas: ఎలక్షన్ అంటేనే హామీలు. ఐదేళ్లకోసారి ఎన్నికల పండుగ వేళ రాజకీయ పార్టీలు జనాన్ని హామీల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేయడం కామనే!! అయితే వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఇంటిని, ప్రతి ఇల్లాలిని ఆకట్టుకునేలా ఒక హామీ తెరపైకి వచ్చింది. అదే.. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ హామీ! కాంగ్రెస్‌లాంటి బడా నెట్‌వర్క్ కలిగిన పొలిటికల్ పార్టీ కూడా వంటగ్యాస్ సిలిండర్‌పై ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఈ నమ్మకం వెనుక పెద్ద లాజిక్ ఉంది. సామాన్యులను, ప్రతి ఫ్యామిలీని.. వీటన్నింటిని మించి ప్రతి ఇంటి పెద్దను, ప్రతి మహిళను కనెక్ట్ చేసే ఇష్యూ కావడం వల్ల వంటగ్యాస్ సిలిండర్‌ను పట్టుకొని ఎన్నికల సముద్రాన్ని ఈదాలని హస్తం పార్టీ డిసైడ్ అయ్యింది. బహుశా బడా పొలిటికల్ స్ట్రాటజిస్టుల నుంచి కాంగ్రెస్ పెద్దలకు అందిన ఐడియా ఇదే అయి ఉంటుందని అంటున్నారు.
వంట గ్యాస్.. ఎందుకు ఎంచుకున్నారు ?
కరోనా సంక్షోభం, లాక్ డౌన్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నిత్యావసరాల ధరల పెంపు ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. కానీ వీటన్నింటిని వదిలి వంటగ్యాస్ సిలిండర్‌నే ప్రధాన హామీగా కాంగ్రెస్ ఎందుకు వాడుకుంటోంది..? అనే దానికి తగిన ఆన్సర్స్ ఒకే ఒక్క లైన్‌లో చెప్పొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. “కరోనా సంక్షోభం ఒక గతం.. లాక్ డౌన్ ఒక గతం.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం ఎక్కువే కానీ ఇంట్లో దాని డిస్కషన్ తక్కువ. నిత్యావసరాల ధరల పెంపుపై ఇంట్లో డిస్కషన్ ఎక్కువే. కానీ అది కామన్ అండ్ ఓల్డ్ టాపిక్” అని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. వీటన్నింటితో పోలిస్తే వంటగ్యాస్ ధర అనేది గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.700కు పైగా పెరిగింది. ఈ అంశం ప్రజల బ్రెయిన్‌ను నిత్యం కుదిపేస్తోంది. ఇళ్లల్లో నిత్యం దీనిపై డిస్కషన్ జరుగుతోంది. అందుకే త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న అన్ని రాష్ట్రాల్లో గ్యాస్‌పై కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతోంది.
రాజస్థాన్ మోడల్ రెడీ చేస్తున్న కాంగ్రెస్..
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇటీవల మధ్యప్రదేశ్‌లో హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ ఇప్పటికే ఈ హామీని అమల్లోకి తెచ్చింది. ఎలక్షన్స్ జరగబోయే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ దొరకాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఈ స్కీమ్‌ను రాజస్థాన్ సర్కారు అమలు చేస్తోంది. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు ఉందనే విషయాన్ని జనాలకు చెప్పేందుకు నమూనాగా రాజస్థాన్‌ను కాంగ్రెస్ వాడుకోనుంది. త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు.. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ స్కీంను అక్కడ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ స్కీం సాధ్యాసాధ్యాలు, బడ్జెట్ కేటాయింపులపై అధ్యయనానికి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ ఒక కమిటీని నియమించారు.
కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?
తెలంగాణలోనూ ఈ హామీని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకురానుంది. వృద్ధాప్య పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ చెప్పగానే.. ఇప్పుడే 1000 రూపాయలు పెంచి రూ.3000 చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరి.. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. “ఉచిత పథకాలు వద్దే వద్దు. వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గుల్ల అవుతుంది” అంటున్న ప్రధాని మోడీ వైపు దేశ ఓటర్లు ఉంటారా..? లేక.. “సబ్సిడీలు ఇవ్వడం ఉచిత పథకం కాదు” అంటున్న కాంగ్రెస్ వైపు ఓటర్లు ఉంటారా..? వేచి చూడాలి!!