Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట!!

శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డితోపాటు శరత్ చంద్రారెడ్డి కూడా గతంలోనే అప్రూవర్స్‌గా మారి పలు కీలక సమాచారం అందించారు. దీంతో ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2023 | 05:44 PMLast Updated on: Sep 08, 2023 | 5:44 PM

Magunta Srinivasulu Reddy Turns Approver In Delhi Liquor Scam Case With Ed

Delhi Liquor Scam: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. కేసు విచారణ జరుపుతున్న ఈడీకి మాగుంట కీలక సమాచారం ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూపు నుంచి ఎక్కువ మంది అప్రూవర్స్‌గా మారడం ఆసక్తి కలిగిస్తోంది.

శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డితోపాటు శరత్ చంద్రారెడ్డి కూడా గతంలోనే అప్రూవర్స్‌గా మారి పలు కీలక సమాచారం అందించారు. దీంతో ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అప్రూవర్స్‌గా మారిన ఈ ముగ్గురూ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ మరింత మందిని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఫోకస్ చేసింది. జీ20 సదస్సు ముగిశాక లిక్కర్ కేసులో అసలు కథ ప్రారంభం అవుతుందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొంతకాలంగా లిక్కర్ కేసు స్కాంలో ఎలాంటి కదలికా లేదు. దీనిపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ జోక్యం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ కేసును నీరుగార్చాయని విమర్శిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దర్యాప్తు సబ్దుగా సాగుతున్నట్లు కనిపించినా, అంతర్గతంగా అవసరమైన విచారణ జరుగుతోందని ఈడి వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్‌గా దూకుడు పెరుగుతుందని, తెలంగాణాకు సంబంధించి కీలక వ్యవహారాలు కూడా తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేసులో కీలక అంశాలపై విచారణ జరుగుతుంది. తెలంగాణాలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి సారించింది. తెలంగాణ నుంచి హవాలా వ్యవహారాలు నడిపే 20 మందికి పైగా కీలక వ్యక్తులను ఈడీ అధికారులు పిలిచి, ఇప్పటికే విచారణ జరిపారు. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా ఇటీవల ఈడీ మరోసారి ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో మరికొంతమందిని అధికారులు ప్రశ్నించబోతున్నట్లు సమాచారం.