టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌ గౌడ్‌.. ఆ ఒక్కటే ఈయనకు కలిసొచ్చిందా..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా మహేష్‌ గౌడ్‌ను నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 05:46 PMLast Updated on: Sep 06, 2024 | 5:46 PM

Mahesh Kumar Goud Appointed As Congress Telangana Unit Chief

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా మహేష్‌ గౌడ్‌ను నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రేవంత్ స్థానంలో పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరా అని తీవ్ర ఉత్కంఠ కనిపించింది. అటు పార్టీ హైకమాండ్ కూడా చీఫ్ ఎంపికలో మల్లాగుల్లాలు పడింది. చివరికి మహేష్‌ గౌడ్‌ వైపు మొగ్గు చూపించింది. టీపీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం పెద్దలు.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ముగ్గురినీ ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్ఠానం.. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలా.. లేదంటే ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించాలా అన్న దానిపై అధిష్ఠానం దగ్గర భారీ చర్చే నడిచింది. చివరికి బీసీ సామాజికవర్గం వైపే మొగ్గుచూపించింది. మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు.. మధు యాష్కీ, ఎంపీ సురేష్‌ షెట్కార్‌, మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, వీహెచ్‌.. ఇలా చాలామంది పీసీసీ చీఫ్ కోసం పోటీ పడ్డారు. ఐతే చివరికి మహేష్‌ గౌడ్‌ వైపు.. అధిష్టానం మొగ్గుచూపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ గౌడ్‌.. కాలేజీ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో తన ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో డిచ్‌పల్లి నుంచి, 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీలో చాలా సీనియర్… తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ హేమాహేమీలు బీఆర్ఎస్‌లో చేరినా.. ఆయన అలాంటి ఆలోచన కూడా రానివ్వలేదు. పార్టీకి విశ్వాసంగా ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. బీసీ సామాజికవర్గం కావడం కూడా.. మహేష్ గౌడ్‌కు కలిసొచ్చింది. ఓవైపు బీజేపీ బీసీ మంత్రం జపిస్తోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి జనాలు కమలం పార్టీతో నడుస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి బీసీ బలం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో 53శాతం బీసీలుంగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వర్గాలు కమలం పార్టీ వెంటే కనిపించాయ్. బీజేపీకి చెక్ పెట్టాలంటే.. బీసీని చీఫ్‌గా చేయడం బెటర్ అని మహేష్‌ గౌడ్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. పైగా పార్టీలో అందరితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయ్. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి, ఇతర సీనియర్లతోనూ ఈయన సఖ్యతగానే ఉంటారు. ఇలా అన్నీ మహేష్‌ గౌడ్‌కు అన్నీ కలిసొచ్చాయ్.