Mahua Moitra: లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ
పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకుంది. మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఈ నివేదికలో పేర్కొంది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు.
Mahua Moitra: లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడింది. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న మహువా మొయిత్రాపై.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని కొద్ది రోజుల క్రితం ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలను బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించారు.
FREE BUS RIDE: బస్సులు సరిపోతాయా..? కర్ణాటక పథకంతో ఆర్టీసీకి లాభమా..? ఎలా..?
పార్లమెంటు నైతిక విలువల కమిటీ దీనిపై విచారణ జరిపింది. అనంతరం ఈ కమిటీ 500 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదిక శుక్రవారం పార్లమెంటు వద్దకు వచ్చింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకుంది. మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఈ నివేదికలో పేర్కొంది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. అయితే, ఆ నివేదికను అధ్యయనం చేసే సమయం కూడా ఇవ్వకపోవడంపై టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కనీసం సభలో మహువా మొయిత్రాకు తన వాదన వినిపించే అవకాశమైనా ఇవ్వాలని కోరాయి.
కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తదితరులు మహువా మొయిత్రాని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ, స్పీకర్ దీనికి అంగీకరించలేదు. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై పార్లమెంటు బయట మహువా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బహిష్కరించే హక్కు పార్లమెంటు నైతిక విలువల కమిటీకి లేదన్నారు. ఇది బీజేపీ ముగింపునకు ఆరంభం అంటూ విమర్శించారు. తమ పార్టీ ఎంపీని లోక్ సభ నుంచి బహిష్కరించడంపై టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.