దుర్గమ్మ గుడిలో అధికారుల అపచారం
దసరా ఉత్సవాల్లో ఘోర అపచారానికి పాల్పడ్డారు అధికారులు. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

దసరా ఉత్సవాల్లో ఘోర అపచారానికి పాల్పడ్డారు అధికారులు. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దేవాదాయ శాఖ అధికారులు… బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేసారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం అని పలువురు మండిపడుతున్నారు.
దుర్గగుడికి పెదకాకాని,మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి 37 వేల లడ్డూలు వచ్చాయి. భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ఇతర ఆలయాల నుంచి తెచ్చిన లడ్డూలు పంపిణీ చేసారు. ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరు పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం…ప్రీతికరంగా భావిస్తారు. లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని అధికారులు సమర్ధించుకోవడం గమనార్హం. సామాన్యభక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను అధికారులు దెబ్బ తీసారనే ఆరోపణలు వస్తున్నాయి.