Third Front: మళ్లీ మూడో ఫ్రంట్..! వీళ్లు మోడీని ఓడిస్తారట…!
తృణముల్‌కు బెంగాల్‌లోనే కాదు చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడర్ ఉంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు... ఇటు తృణముల్ గెలవదు.. అది బీజేపీకి లాభించేదే..
బీజేపీ పాలనను అంతం చేయడానికి ఏకమవుతామని ప్రతిజ్ఞ చేసిన ప్రతిపక్షాలు మళ్లీ మొదటికి వచ్చాయి. మరోసారి మూడో ఫ్రంట్ పల్లవిని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ ముక్త్ విపక్ష్ నినాదాన్ని బయటకు తీశాయి… ఇది కాంగ్రెస్‌ను దూరం పెట్టడమా… మోడీకి సాయం చేయడమా…?
తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీయేతర మూడో ఫ్రంట్ పై చర్చించారు. తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉంటుందని ప్రకటించారు అఖిలేష్ యాదవ్. నవీన్ పట్నాయక్‌ను కూడా కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మమత. మరికొందరు నేతలను కూడా కలుపుకుని వెళ్లాలన్నది మమత యోచన. కొంతకాలంగా మమతాబెనర్జీ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. మిగిలిన ప్రతిపక్షాలను కూడా పెద్దగా కలుపుకుపోవడం లేదు. అలాంటి మమత ఒక్కసారిగా టాప్‌గేర్ ఎందుకేశారా అన్నది ఆసక్తిని రేపుతోంది.
కాంగ్రెస్ సహా అందరినీ కలుపుకు పోవాలన్నది మమతాబెనర్జీ మొదట ఆలోచించారు. కానీ ప్రతిపక్షాల ఐక్యత తనకు మంచిది కాదని భావించిన బీజేపీ కొత్త ఎత్తుగడ వేసింది. రాహుల్ గాంధీపై ఫోకస్ పెట్టింది. ఆయన్ను హైలైట్ చేయడం ప్రారంభించింది. ప్రతిపక్ష నేతను పెద్దవాడ్ని చేయడం వ్యూహమా అంటే అక్కడే ఉంది కిటుకు. రాహుల్‌ను పెంచడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయనే లీడర్ అన్న భావన వచ్చేలా చేశారు. ఇది మిగిలిన ప్రతిపక్షాలకు అనుమానాలు రేకెత్తించింది. రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏ పార్టీ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా బీజేపీ వ్యూహం ఫలించింది. ఆ ఉచ్చులో పడ్డ పార్టీలు మరోసారి మూడో ఫ్రంట్ అంటూ పాత చింతకాయ పచ్చడి జాడీని కిందకు దించాయి.
కలసి వచ్చే పార్టీలేవి…?
మమత బెనర్జీ ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ ఎన్ని పార్టీలు కలసి వస్తాయన్నది పెద్ద ప్రశ్నే… తమిళనాడును తీసుకుంటే స్టాలిన్ కాంగ్రెస్‌తో చాలాకాలంగా కలిసే ఉన్నారు. ఇక మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంది. ఉద్దవ్ థాక్రేదీ అదే పరిస్థితి. నవీన్ పట్నాయక్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమదూరంలో ఉన్నారు. అలాగని ఆయన ఇతర పార్టీలతో కలసి నడిచేందుకు అంత ఆసక్తిగా లేరు. జాతీయస్థాయి నాయకత్వంపై ఆయనకు ఆశా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక నితీశ్ కుమార్ కాంగ్రెస్‌ను కూడా కలుపుకు పోవాలంటున్నారు. అసలు ఓ సరైన వ్యూహం లేని ఫ్రంట్ లో చేరేందుకు సిద్ధంగా లేమంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. తెలంగాణ సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటన్నది అర్థం కావడం లేదు. మమత ఆయనతో భేటీపై అంత ఆసక్తిగానూ ఉన్నట్లు లేదు. ఇక కాంగ్రెస్ అయితే ఎవరు కలసి వస్తే వారిని కలుపుకుపోవాలని ఎదురు చూస్తోంది.
అసలు ఈ పరిస్థితుల్లో మూడో ఫ్రంట్ సాధ్యమైనా అంటే డౌటే… ప్రధాని మోడీ ఎంత బలంగా ఉన్నారో అందరికీ తెలుసు… ఆ పర్వతాన్ని ఢీకొట్టాలంటే మాటలు కాదు… చేతలు కావాలి… ఓడించాలన్న కసి ఒక్కటే కాదు సరైన వ్యూహం కావాలి… అన్ని ప్రతిపక్షాలు ఏకమై కలసి నడిస్తేనే మోడీ అనే మహాశక్తిని ఎదుర్కోగలరు.. ఆ సంగతి అన్ని ప్రతిపక్షాలకు తెలుసు.. శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని పాటించాల్సింది పోయి తమలో తాము కొట్లాడుకుంటున్నాయి.
కాంగ్రెస్‌ను పెద్దన్నగా ఒప్పుకుంటే వీటికి వచ్చే ముప్పేంటి అంటే దాని వెనక రాజకీయ కారణాలే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ చేస్తోంది. త్రిపురలోనూ అదే పరిస్థితి. రాష్ట్రంలో శత్రువును జాతీయ స్థాయిలో పెద్దన్నగా మమత ఒప్పుకునే పరిస్థితి లేదు. కేసీఆర్‌దీ అదే పరిస్థితి. కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరిస్తే అది రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రమాదకరం. కాచుకు కూర్చున్న కమలానికి ఓ అస్త్రాన్ని ఇచ్చినట్లే… ఇది కేసీఆర్‌కు ఇష్టం లేదు. ఇక ఏపీ సీఎం జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయన్ను కలుపుకునే ఆలోచన కూడా విపక్షాలు చేయలేదు. ఇక టీడీపీ ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడు మాత్రం సీన్ మారింది. కమలంతో కయ్యానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇలా రాజకీయంగా ఎవరి లెక్కలు వారికున్నాయి. దీంతో ప్రతిపక్షాల్లో ఐక్యత అందనంత దూరంలో మిగిలిపోయింది. పార్లమెంట్ లో నినాదాలు చేయడంలో కనిపించే ఐక్యత.. పోటీ చేయడంలో మాత్రం కనిపించడం లేదు.
ఇలాగైతే వీరంతా మోడీని ఎలా ఎదుర్కోగలరు…? ఆయా రాష్ట్రాల్లో చూసుకుందాం అంటే సరిపోదు కదా…! ఉదాహరణకు తృణముల్‌కు బెంగాల్‌లోనే కాదు చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడర్ ఉంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు… ఇటు తృణముల్ గెలవదు.. అది బీజేపీకి లాభించేదే… ఇలా ప్రతిపక్షాల్లో ఐక్యత లేనప్పుడు మోడీని గెలవడం అసాధ్యమని పొలిటికల్ పండిట్స్‌కే కాదు పాలిటిక్స్ గురించి అంతో ఇంతో తెలిసిన సామాన్యుడు కూడా చెప్పేయగలడు.